అవసరం అయితే ఏపీ సర్కార్‌తో ఫైటింగ్ కైనా రెడీ ... వైఎస్ షర్మిల సపరేట్ పార్టీ వెనుక పెద్ద కథే !!
తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధం కావడం ఇటు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు అటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది. షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఎవరున్నారు అన్నదానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతల స్పందన .. సీనియర్ నేత వీహెచ్ , సీతక్క సంచలనం

వైసీపీకి తోక పార్టీ కాదు , సింగిల్ గానే ఎన్నికల బరిలో : కొండా రాఘవరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో షర్మిల కొత్త పార్టీ గురించి లోటస్ పాండ్ దగ్గర వైసీపీలో కీలకంగా పనిచేసిన కొండా రాఘవరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పెట్టబోతున్న వైయస్సార్ టీపీ, వైయస్సార్ సిపీకి తోక పార్టీగా ఉండడానికి సిద్ధంగా లేదని, కొత్త పార్టీతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని కొండా రాఘవ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 18 నెలలలో అన్ని హామీలు నెరవేర్చారని, మంచి పాలన అందిస్తున్నారని పేర్కొన్న కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీని తెలంగాణలో కూడా కొనసాగిస్తే రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు పరిష్కారం కాదని పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్లు, నిధులు, నియామకాల పంచాయితీలు.. అందుకే కొత్త పార్టీ
అక్కడ పార్టీ ఇక్కడ పెడితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్లు, నిధులు, నియామకాల పంచాయితీలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఎవరితోనూ సంబంధం లేకుండా కొత్త పార్టీ పెట్టడం వల్ల అవసరమనుకుంటే ఏపీ సర్కార్ తో ఫైట్ చేయడానికైనా సిద్ధంగా ఉంటామని, అందులో భాగంగానే షర్మిలమ్మ కొత్త పార్టీ పెడుతున్నారని కొండ రాఘవ రెడ్డి వెల్లడించారు.
ఇదే సమయంలో ఒకే కుటుంబంలో రెండు పార్టీలు పెట్టకూడదని ఏదైనా రాజ్యాంగంలో ఉందా అంటూ ప్రశ్నించిన కొండా రాఘవరెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డికి పొత్తుల పంచాయితీ లేదని, ఇప్పుడు షర్మిల పార్టీకి కూడా ఎవరితోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.

సీఎం అభ్యర్థిగా కూడా షర్మిలనే ప్రకటించిన నేత
రాష్ట్రంలో వైయస్సార్ తరహాలో పాదయాత్రలు, పోరాటాలు చేస్తామని, సీఎం అభ్యర్థిగా కూడా షర్మిల అని ప్రకటించిన ఆయన ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. దేశంలోనే 3212 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఏకైక మహిళ షర్మిల కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.
పాదయాత్ర సమయంలో షర్మిల ప్రజల కష్టాలు చూశారని, వారు అనుభవిస్తున్న బాధలను చూశారని , అందుకే వాళ్ల కోసం రాజకీయాల్లోకి వచ్చారని కొండ రాఘవ రెడ్డి పేర్కొన్నారు.

రోజు పంచాయతీలు పెట్టుకోడానికి అది కెసిఆర్ ఫ్యామిలీ కాదు : కొండా రాఘవరెడ్డి
వైయస్ కుటుంబం లో ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన కొండా రాఘవరెడ్డి, రోజు పంచాయతీలు పెట్టుకోడానికి అది కెసిఆర్ ఫ్యామిలీ కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపి, నెల రోజుల తర్వాత ఒక సుముహూర్తాన పార్టీ జెండా పేరును ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీలో నేపథ్యంలోని, వైసీపీ ని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించకుండా, షర్మిల కొత్త పార్టీ పెట్టినట్లుగా కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.