జానా రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి: బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా!?
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావటంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరుతారని చర్చ జరుగుతోంది.

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందటంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.. కమలం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీ బలోపడుతుందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, శుక్రవారం మాజీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో పోచారం హస్తం గూటికి చేరారు.గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి సహా 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరతారన్నారు. ముగ్గురు నలుగురు మినహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హస్తం గూటికి చేరతారని చెప్పారు.












Click it and Unblock the Notifications