బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.రెండు రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. 'ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?' అంటూ సదరు ఎమ్మెల్యేపై కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ 'నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో' అన్నారు.

ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కారణంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.మరోవైపు ఎమ్మెల్యే సంజయ్‌ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications