"స్పీకర్ పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా" - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో పోలీసులకూ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకూ మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో స్పీకర్ అదేశాలతో తాము అడ్డుకుంటున్నట్లు పోలీసులు చెప్పడం, స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (tata madhu) అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిపోయాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు తీవ్రంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ప్రకటించారు. అయితే తాను అనని మాటల్ని తనకు ఆపాదించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి స్పీకర్ ను తానేమీ అనలేదని, అయినా ఆయన్ను అన్నట్లు భావిస్తే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తాతా మధు తెలిపారు. తనపై దాడి చేసి గొంతు నొక్కేందుకు ప్రయత్నించిన వారిపైనే ఆవేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు.

అంతకు ముందు ఉదయం తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం తాతా మధు వ్యాఖ్యల్ని ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకునే లోపే ఆయనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. కాబట్టి తాతా మధుపై ప్రభుత్వ పెద్దలు స్పీకర్ ద్వారా చర్యలు తీసుకుంటారా లేక ఇంతటితో వివాదాన్ని ముగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
