బీఆర్ఎస్ అంటే.. : కొత్త అర్థం చెప్పిన జేపీ నడ్డా
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. దేశ రాజధాని నుంచి వర్చువల్ విధానంలో ఆయన ఇందులో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న తెలంగాణలో ఇవ్వాళ జేపీ నడ్డా పర్యటించాల్సి ఉంది. ఇది రద్దయింది. దీనితో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఇందులో పాల్గొన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు జేపీ నడ్డా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కుటుంబ పాలనలో చిక్కుకుపోయిందని విమర్శించారు. తెలంగాణను అవినీతి ఊబిలో దించారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తోందంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని.. భ్రష్టాచార్ (అవినీతి) రిష్వత్ (లంచగొండి) సర్కార్ అని కొత్త నిర్వచనం ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ.. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అలాంటిది ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని చెప్పారు. ఇంతగా లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినప్పటికీ.. అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఆ నిధులు ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రం అప్పులపాలు కావడానికి కారణం బీఆర్ఎస్ పరిపాలనేనని ఆరోపించారు.
తెలంగాణ, ఏపీలను అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం.. ఎంతో చేసిందని జేపీ నడ్డా అన్నారు. జాతీయ రహదారులను మంజూరు చేశామని, వాటిని విస్తరించామని గుర్తు చేశారు. కొత్త రైలు మార్గాలను కేటాయించామని పేర్కొన్నారు. విమానాశ్రయాలను నెలకొల్పామని వివరించారు. పరిశ్రమలను స్థాపించడానికి అనువైన వాతావరణాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్పించామని వ్యాఖ్యానించారు.
శక్తివంచన లేకుండా మోదీ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో అవినీతిమయమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి అనేది పేదలకు చేరట్లేదని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను సాగనంపడానికి ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని, బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకోవాలని జేపీ నడ్డా పార్టీ క్యాడర్ కు సూచించారు.












Click it and Unblock the Notifications