Budget 2024: కేంద్ర బడ్జెట్ పై తెలంగాణా ఆశలు.. ఈసారైనా నెరవేరేనా!!
ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ మధ్యంతర బడ్జెట్ పై అన్ని రాష్ట్రాలకు అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులపై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ బడ్జెట్ లో అయినా కేంద్రం తెలంగాణా అవసరాలకు తగ్గట్టు నిధులు కేటాయిస్తుందని భావిస్తుంది.
Recommended Video

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ ఆశిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకుని కేటాయింపులు చేస్తారని భావిస్తుంది . తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి, ఐఐటి హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేస్తే బాగుంటుందని తెలంగాణ ఆశలు పెట్టుకుంది.

అంతేకాదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, నవోదయ, సైనిక్ స్కూల్ లను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక అంతే కాదు నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆశిస్తుంది.
తెలంగాణ బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి నిధులు కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తుంది. కేంద్రం ఇస్తున్న జీఎస్టీ వాటాలను పెంచాలని కోరుతోంది. అలాగే గత మూడు బడ్జెట్లలో రైల్వే ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు జరగలేదని, ఈసారి ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి రైల్వే ప్రాజెక్టులలో భారీ కేటాయింపులు చేసే అవకాశం ఉంటుందని ఆశిస్తుంది.
మనోహరాబాద్ కొత్తపల్లి లైనుకు, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కి భారీగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే కాజీపేట బల్లార్షా, కాజీపేట విజయవాడ మూడో లైన్ కు కూడా ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. భద్రాచలం కొవ్వూరు, రామగుండం మణుగూరు ప్రాజెక్టుల విషయాల్లో కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని అంచనా ఉంది.












Click it and Unblock the Notifications