తెలంగాణపై చంద్రబాబు ఫోకస్-ఖమ్మం బహిరంగసభ ప్లాన్-ముంపు గ్రామాల విలీనానికి ఒప్పుకుంటారా ?
ఏపీ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్ పెట్టారు. గోదావరి వరద ముంపు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు. అయితే ఒకప్పుడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిపిన గ్రామాలే ఇప్పుడు ముంపుకు గురికావడంతో ఆయా గ్రామాల సమస్యను అఖిలపక్షం ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

గోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు
కనీవినీ రీతిలో వచ్చిన గోదావరి వరద కారణంగా ముంపుకు గురైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రెండోరోజు పర్యటిస్తున్నారు. అక్కడ స్ధానికంగా వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని చంద్రబాబు పరామర్శించారు. వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరద నుంచి ఆయా గ్రామాలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. అదే సమయంలో మరిన్ని కీలకాంశాలు చంద్రబాబు టూర్ లో చోటు చేసుకుంటున్నాయి.

ముంపు గ్రామాల విలీనానికి సాయం కోరిన అఖిలపక్షం
అయితే చంద్రబాబు టూర్ లో పోలవరం ముంపు కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఆయనకు ఎదురవుతోంది. నిన్న ఏపీ పరిధిలో ఉన్న పోలవరం ముంపు గ్రామాల్ని పరిశీలించిన చంద్రబాబు.. ఇవాళ తెలంగాణ పరిధిలో ఉన్న గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా అఖిలపక్ష నేతలు చంద్రబాబును కలిసి తిరిగి ఆయా గ్రామాల్ని ఏపీలో కలిపేందుకు సహకరించాలని కోరారు. దీనిపై చంద్రబాబు వెంటనే ఎలాంటి హామీ ఇవ్వలేదు.

తెలంగాణలో చంద్రబాబు ఫోకస్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా స్ధానికంగా ఆయనకు మంచి ఆదరణ లభించింది. దీంతో చంద్రబాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ టూర్ కొనసాగిస్తున్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు వెంట మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేతలు కూడా వెళ్లారు. అక్కడ సీతారామచంద్ర స్వామిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయంలో మూలవిరాట్‍ను దర్శించుకొని చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెడుతున్నట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో టీడీపీకి మళ్లీ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని చంద్రబాబు తెలిపారహు. హైదరాబాద్ లో టీడీపీ పెట్టామని, ఖమ్మం టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు అన్నారు. సెప్టెంబర్ లో ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని కూడా క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో టీడీపీకి అద్భుతమైన స్పందన ఉందని చంద్రబాబు తెలిపారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలంగాణపై ఫోకస్ పెడతామన్న సంకేతాల్ని టీడీపీ అధినేత ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వైఎస్ జగన్ సోదరి షర్మిల పోటీ చేస్తామన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇదే జిల్లాపై ఫోకస్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications