సస్యశ్యామలం: కాటన్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పెట్టనున్న కేసీఆర్ విగ్రహం ఇదే
హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సోమవారం భూమి పూజ చేశారు. భూమి పూజ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ఈరోజు భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు.
మేడిగడ్డ ద్వారా కరీంనగర్ జిల్లాలో రెండు పంటలు పండించుకోవచ్చు అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నేపథ్యంలో ఇదే ప్రాజెక్ట్ వద్ద సీఎం కేసీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కరీంనగర్ జిల్లా వాసులు రంగం సిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై రిజర్వాయర్ నిర్మించిన నాటి బ్రిటిష్ జనరల్ అండ్ ఇంజినీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ విగ్రహాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో సీఎం కేసీఆర్ ఏడడుగుల విగ్రహాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసేందుకు మంథని ఎమ్మెల్యే పుట్టమధు సమాయాత్తం అవుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే సిద్ధమైన కేసీఆర్ విగ్రహాన్ని మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు నివాసంలో అందుబాటులో ఉంచారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి వెళ్లిన తర్వాత విగ్రహ స్థాపన కార్యక్రమం చేపట్టాలని పుట్టమధు యోచిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోని బీడు భూముల సస్యశ్యామలం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనులకు అనుమతులను మంజారు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మేడిగడ్డ నుంచి అన్నారం వరకు రూ.3,524 కోట్లు, అన్నారం నుంచి సుందిళ్ల వరకు రూ.2140 కోట్లు, సుందిల్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి వరకు రూ.2,334 కోట్లు విడుదల చేసి రివర్స్ పంపింగ్ ద్వారా బీడు భూములను సాగు భూములుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతుండడంతో మంథని ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం అవుతోంది.
పూర్తిగా గోదావరి, ప్రాణహిత జలాల సద్వినియోగానికి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు మంథని నియోజకవర్గంలోనే ఉన్నారు. దీనికి కృతజ్ఞతగా మంథని ఎమ్మెల్యే పుట్టమధు సీఎం కేసీఆర్ విగ్రహాన్ని మేడిగడ్డ వద్ద నెలకొల్పనున్నారు. ప్రజల సమక్షంలోనే సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications