పిలిస్తే బీజేపీలోకి చిరంజీవి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలనం!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఆహ్వానిస్తే చిరంజీవి పార్టీలోకి వస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు బిజెపిలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యలు చేశారు. తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
చిరంజీవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
బిజెపికి అనేకమంది సినీ ప్రముఖులకు సంబంధాలున్నాయని బిజెపిలో చేరిన ఎంతోమంది సినీ ప్రముఖులు మంత్రులు కూడా అయ్యారని కొంతమంది పార్టీకోసం ప్రచారం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన కిషన్ రెడ్డి
బిజెపిలో తర్వాత అధ్యక్షుడు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పగలరా అంటూ ప్రశ్నించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో తర్వాత అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఉంటాయని, కానీ బిజెపిలో ఆ విధంగా ఉండవని ఆయన వెల్లడించారు. బిజెపి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే రెండుసార్లు క్రియాశీల సభ్యులుగా ఉండాలని పేర్కొన్నారు.
రాజకీయాలపై అనేకమార్లు తేల్చి చెప్పిన చిరంజీవి
ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారని అందువల్ల ఆయనకు నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాల పైన మాట్లాడిన ఆయన చిరంజీవి బిజెపిలోకి వస్తాడని చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారాన్ని సృష్టించాయి. అయితే ఇప్పటికే అనేకమార్లు చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావాలని పలు ప్రముఖ రాజకీయ నేతలు ప్రస్తావన తెచ్చినప్పటికీ చిరంజీవి తనకు అటువంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
గతంలోనూ చిరంజీవి రాజకీయాలపై చర్చ
అయినప్పటికీ మళ్లీ చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు రావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్ చిరంజీవిని తన ఇంటికి పిలిచి, భోజనం స్వయంగా వడ్డించి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఇక బిజెపి నుంచి కూడా రాజ్యసభ సీటు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
చిరంజీవి బీజేపీలోకి పిలిస్తే వస్తారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తారా?
ఇప్పుడు కిషన్ రెడ్డి బిజెపిలోకి తాను పిలిస్తే చిరంజీవి వస్తారని చెబుతున్నారు. కానీ చిరంజీవి రాజకీయాల పట్ల ఆసక్తిని ఏమాత్రం కనబరచడం లేదు. ఏది ఏమైనా ఎవరికి వారు చిరంజీవి రాజకీయాల పైన అప్పుడప్పుడు కాస్త మసాలా యాడ్ చేయడం మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో చిరంజీవి ఏమంటారు అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications