SLBC సొరంగం కూలిన ఘటన.. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి.. వారికోసం ప్రత్యేక హెలికాఫ్టర్!
శ్రీశైలం ఎడమ కాలువ గట్టు టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో పలువురికి గాయాలైన సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సొరంగంలో ఉన్న కార్మికులను ప్రాణాలతో కాపాడాలని దాని కోసం యుద్ధ ప్రాతిపదిక పనులు మొదలు పెట్టాలని సూచించారు.
సహాయక చర్యలకు ప్రత్యేక హెలికాఫ్టర్
నల్గొండ జిల్లాకు సంబంధించి కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపకశాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక హెలికాఫ్టర్ ను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాఫ్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తున్నారు.

బాధితులకు పరిహారం కోసం సీపీఎం డిమాండ్
శ్రీశైలం సొరంగ మార్గం లో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికుల జాడ తెలియాల్సి ఉన్నదని తోటి కార్మికులు చెబుతున్నారని చెప్పారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బాధితులకు ఉచిత వైద్యం అందిస్తూ, తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు..
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో ప్రమాదం
ఇదిలా ఉంటే నేడు ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైభాగం మూడు మీటర్ల మేర కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తంఏడుగురు కార్మికులు గాయాలు పాలు కాగా కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే ఇంకా మరి కొంతమంది కార్మికులు సొరంగం లోపలే ఉన్నట్టుగా సమాచారం. వీరిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి యుద్ధప్రాతిపదికన అక్కడ చర్యలు చేపట్టారు.
సుదీర్ఘ కాలం తర్వాత సొరంగం పనుల్లో ప్రమాదం
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడే రూపకల్పన చేయగా ఈ టన్నెల్ సొరంగం తవ్వకం ఆది నుండి అనేక అంతరాలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ సాగింది. 2019 డిసెంబర్ వరకు ఆడపాదడపా సాగిన టన్నెల్ నిర్మాణ పనులు ఆ తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ సొరంగం పనులు కొనసాగుతున్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications