నేటి నుంచే సీఎం రేవంత్ జిల్లాల పర్యటన... టార్గెట్ అదే!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టి విజయం సాధించిన అధికార కాంగ్రెస్, అదే ఊపును మున్సిపాలిటీల్లోనూ కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ సంస్థలపై పట్టు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాచరణ మరింత దూకుడుగా మారింది.
ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు ప్రారంభించడంతో రాజకీయ హీట్ మరింత పెరిగింది. తొలి రోజు ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చనాకా-కొరటా బ్యారేజీ, సదర్మాట్ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేసి.. సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను రైతులకు తెలియజేయనున్నారు.

అనంతరం నిర్మల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఏకమై పనిచేయాలని ఆయన పిలుపునివ్వనున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగనున్నాయి.
ఇక రేపు ( జనవరి 17, 2026 ) మహబూబ్‌నగర్ జిల్లాలో, ఎల్లుండి ( జనవరి 18, 2026 ) ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ జిల్లాల్లోనూ అభివృద్ధి పనుల ప్రారంభం, సమీక్షలతో పాటు బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలను విడుదల చేయగా.. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. మరో వారం రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చాయి.
ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు ప్రారంభించడంతో మున్సిపల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పట్టణ ఎన్నికలు ప్రధాన చర్చాంశంగా నిలవనున్నాయి.












Click it and Unblock the Notifications