ఏపీతో కృష్ణా జలాలపై తేల్చనున్న సుప్రీంకోర్టు- రేవంత్ రెడ్డి రివ్యూ
ఏపీతో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన అత్యంత కీలకమైన పిటీషన్.. ఈ నెల 18వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆధిత్యనాథ్ దాస్, ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించడానికి సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఏపీతో వివాదం ఉన్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలను సమర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఎలాంటి అలసత్వానికి తావులేదని ఆయన తేల్చిచెప్పారు. మొదట సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అదనపు టీఎంసీ పనుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కోర్టు ముందుకు సమర్థవంతంగా తీసుకెళ్లడానికి రూపొందించిన లీగల్ స్ట్రాటజీ గురించి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చర్చించారు. అంతర్రాష్ట్ర వివాదాల్లో తమ వాదన గట్టిగా వినిపించాలని అన్నారు.
అనంతరం వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు రేవంత్ రెడ్డి. డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని అన్నారు. గతంలో అనుకున్న ప్రతిపాదనల ప్రకారం నార్లాపూర్ నుంచి ఏడుల వరకు నీటిని సరఫరా చేయడం, అక్కడ నుంచి ఈ రెండు ప్రాజెక్టులకు నీటిని అందించాలని చెప్పారు. ఇందుకు అవసరమైన 0.6 టీఎంసీల నీటి తరలింపులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా ఎక్కడెక్కడ టన్నెళ్లు, కాలువలు తవ్వాల్సి ఉంటుందో వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే చేసి గుర్తించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ రూపొందించాలని, అది సిద్ధమైన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలని భావించిన అదనపు ఒక టీఎంసీ నీటి తరలింపు పనులపై అధికారులకు రేవంత్ రెడ్డి కీలక హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లను తాము పునరావృతం చేయబోమని, ప్రజల సొమ్మును వృథా చేయకుండా ప్రతి అడుగు బాధ్యతాయుతంగా వేయాలని అధికారులకు తేల్చి చెప్పారు.













Click it and Unblock the Notifications
