కేంద్రానికి కృతజ్ఞతలు చెప్తూనే.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతుల వెల్లువ!
సకల హంగులతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్ విధానంలో ప్రారంభించారు. చర్లపల్లి టెర్మినల్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణా అభివృద్ధికి అనేక ప్రాజెక్ట్ లను కేంద్రం ఇవ్వాల్సి ఉందని, ఆ చిట్టాను కేంద్రానికి విన్నవించారు.
కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
భారతదేశ అభివృద్ధికి రైల్వేల అభివృద్ధి చాలా కీలకమని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి కూడా రైల్వేల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందన్నారు.
హైదరాబాద్‌లోని చర్లపల్లిలో కొత్త టెర్మినల్, స్టేషన్‌ను పూర్తి చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డైరెక్ట్ రైల్వే నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరుతున్నామని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

మీరు సహకరిస్తే తెలంగాణా ప్రగతి
తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ ను నిర్మించబోతున్నామని, కేంద్ర సహకారం అవసరం అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని పేర్కొన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 కు పూర్తి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
మీ లక్ష్యానికి మా సంకల్పం ఉపయోగపడుతుంది
వికారాబాద్ నుంచి కృష్ణా రైలు మార్గాన్ని, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు, డోర్నకల్ నుంచి రెండు లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించామని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణా రాష్ట్రానికి మెట్రో, కొత్త రైల్వే లైన్లు, నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే తెలంగాణా ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications