నేనే వెళ్తా- ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్ ఆదేశం
ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. మేడారం సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మేడారాన్ని సందర్శించనున్నారు. అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు.
మేడారం జాతరపై రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నట్లు వెల్లడించారు.

సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు గద్దె డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈ నెల 23న మేడారం సందర్శించనున్నట్లు తెలిపారు.
పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. జాతర అభివృద్ధి పనులకు సంబంధిత టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని, పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని అన్నారు. అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని చెప్పారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని చెప్పారు.
ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగకు సంబంధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో ఉండాలని, చారిత్రాత్మకంగా, సంప్రదాయాలు ఉట్టి పడేలా వాటిని నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని అన్నారు.












Click it and Unblock the Notifications