Jubilee hills: ఎంఐఎం కంచుకోటలో ఊహించని ఫలితం - ఎగ్జిట్ పోల్స్ కు పరీక్ష..!!
జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్వల్ప అధిక్యతలో ఉంది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. ఇప్పుడు కౌంటింగ్ లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ రోజు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించింది. వీటిల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం పది రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. ఎంఐఎం కంచుకోటల్లోనూ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది దీంతో, చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల కౌంటింగ్ వేళ ఫలితం పై కొత్త టెన్షన్ మొదలైంది. జూబ్లీహిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్-39, బీఆర్ఎస్ -36, బీజేపీ-10 ఓట్లు వచ్చాయి. ఈవీఎంల కౌటింగ్ లో ముందుగా షేక్‌పేట్ డివిజన్‌తో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కాగా, ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్ధి స్వల్ప మెజార్టీతో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 8,926 ఓట్లు బీఆర్ఎస్ కు 8,8864 ఓట్లు వచ్చాయి.

కాగా.. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 9,691 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 8,609 ఓట్లు వచ్చాయి. దీంతో, రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్ధి 1147 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. షేక్ పేట ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు పూర్తి మద్దతు లభించింది. పోలింగ్ వేళ సరళి అదే స్పష్టం చేసింది. అయితే, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక, ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్‌లో 10 బూత్స్, వెంగళరావు డివిజన్‌లో 4 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కింపు చేపడతారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. 42 టేబుల్స్ ద్వారా పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా, 50 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఇక, డివిజన్ల వారీగా పోలింగ్ సరళికి అనుగుణంగా తమకు వచ్చే ఓట్ల పైన పార్టీలు అంచనాలతో ఉన్నాయి.
ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగకపోవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితాలు వెల్లడి అవుతున్నా.. ఎవరికి వారు తామంటే తాము గెలుస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. తొలి రెండు రౌండ్లలోనూ హోరా హోరీగా వస్తున్న మెజార్టీ లెక్కలతో చివరి రౌండ్ వరకు టెన్షన్ తప్పేలా లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications