అక్కడ ఇళ్ళు కట్టాలంటే హైడ్రా పర్మిషన్.. రేవంత్ సర్కార్ సెన్సేషన్!
ప్రభుత్వ భూములలో ఆక్రమణలను తొలగించడం కోసం, చెరువులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం కోసం, ఎఫ్డిఎల్ పరిధిలోను, బఫర్ జోన్లలో ఆక్రమణలను తొలగించడం కోసం, చెరువులను పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మంచి గుర్తింపు వస్తున్న విషయం తెలిసిందే.
దూకుడుగా హైడ్రా
హైడ్రా వ్యవస్థ ఒక్క హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇంప్లిమెంట్ చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూకుడుగా కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుంది.

హైదరాబాద్ ల నిర్మాణాలకు హైడ్రా అనుమతిపై ప్రభుత్వ యోచన
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ఇళ్ల నిర్మాణాలకు ఇకనుంచి హైడ్రాను కొత్త నిబంధనల అనుమతుల ప్రక్రియలో చేర్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే ఇంటి నిర్మాణం
ఇకనుంచి హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకోవాలంటే హైడ్రా నుండి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ నిర్ణయం యొక్క సారాంశం. అంతే కాదు ఎఫ్ టీ ఎల్ పరిధి, బఫర్ జోన్ల పరిధిలో హైడ్రా అనుమతి లేకుండా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ ఇంటి నెంబర్లను, కరెంటు కనెక్షన్లను, నల్ల కనెక్షన్లను తొలగించనున్నట్టు తెలుస్తుంది.
ప్రభుత్వ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా ఉండటం కోసమే
పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదే గనక జరిగితే హైదరాబాదులో ఇకపై భవన నిర్మాణాన్ని చేయాలనుకునేవారు ముఖ్యంగా ఎఫ్డిఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేయాలనుకునేవారు హైడ్రా అనుమతి కోసం కూడా అప్లై చేసుకోవాలి. హైడ్రా అనుమతి ఇస్తేనే నిర్మాణం, లేదంటే అక్కడ నిర్మాణం చేయడానికి వీలు లేదు అని ఖచ్చితమైన నిర్ధారణ.












Click it and Unblock the Notifications