cyber crimes: ముద్ర లోన్స్ నూ వదిలిపెట్టని సైబర్ క్రిమినల్స్.. బీ అలెర్ట్!!
ముద్ర లోన్స్ నూ వదిలిపెట్టని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని నమ్మొద్దని అంటున్నారు సైబర్ పోలీసులు.
సైబర్ నేరగాళ్ళు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం దేశంలో గణనీయంగా పెరిగిన దగ్గరనుండి సైబర్ మోసాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చదువుకున్న వారిని కూడా నిముషాల్లో బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరాలు చేయడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో? అన్నింటినీ ఉపయోగించి అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్ళు.

ముద్రా లోన్ లను వదలని సైబర్ నేరగాళ్ళు
నిన్నా మొన్నటి ద్వారా మీకు లక్కీ డ్రా వచ్చింది.. మీకు బంపర్ ఆఫర్ వచ్చింది.. అంటూ మోసం చేసిన కేటుగాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ను కూడా వదలకుండా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ముద్ర లోన్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద లక్ష రూపాయల రుణాన్ని ఇవ్వడానికి లోన్ అగ్రిమెంట్ చార్జీలుగా 1750 రూపాయలను చెల్లించాలని, లబ్ధిదారులకు పంపుతూ వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.

సైబర్ వలలో పడొద్దని కేంద్రం సూచన
ముద్ర యోజన లోన్ తీసుకుంటున్న లబ్ధిదారులు అది నిజమని నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి లెటర్ కేంద్రం జారీ చేయలేదని, ఇది ఫేక్ అని, ఇటువంటి వాటిని నమ్మొద్దని వెల్లడించింది.
ప్రజల అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. తాము ముద్ర లోన్ కోసం ఎలాంటి చార్జీలు వసూలు చెయ్యటం లేదని స్పష్టం చేసింది. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండకుంటే , సైబర్ నేరస్తులు నిలువునా మోసం చేస్తున్నారు. చాకచక్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారు.

సైబర్ నేరాల పట్ల అలెర్ట్... బీ కేర్ ఫుల్
అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఏది పడితే అది చెబితే నిజమని నమ్మొద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే పోస్ట్ లను కూడా నమ్మొద్దని అంటున్నారు.
దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిన క్రమంలో అప్రమత్తత అవసరం అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే తక్షణం 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లో ఎప్పటికీ సిబ్బంది సైబర్ నేరాల బాధితులకు తక్షణ సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications