కూతురు ప్రేమ పెళ్లి...కోపంతో రోడ్డుపై గోడ కట్టేశారు..
కూతురిని అల్లారు ముద్దుగా పెంచి, బాగా చదివించి ఆ తర్వాత ఓ మంచి యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు ప్రతీ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు. కానీ, ఆ కూతురు ఎవరినో ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటాననే సరికి కొందరు తల్లిదండ్రులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతారు. కుటుంబ సభ్యులకు తెలీకుండా మొదలయ్యే ప్రేమ వ్యవహారాలు.. కొన్నిసార్లు సుఖాంతమైతే, మరికొన్నిసార్లు విషాదంగా మారుతుంటాయి. అలాంటి కథలనే మనం చాలాసార్లు చూసి ఉంటాం. కూతురు ప్రేమను కొందరు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే, మరికొందరు జీర్ణించుకోలేక, చివరకు దారుణాలకు పాల్పడిన సంఘటనలు దేశంలో చాలానే జరిగాయి. ఇప్పడు కూడా అలాంటి ఓ ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. తమ అనుమతి లేకుండా కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుందని ఆ తల్లిదండ్రులు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో కేవలం తమ కూతురు మాత్రమే కాకుండా ఆ గ్రామస్థులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా..?
కన్న కూతురు తల్లిదండ్రులు చెప్పిన మాటన పెడ చెవిన పెట్టి ప్రేమ పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు ఊరి మధ్యలో నడిరోడ్డుపై గోడ కట్టేశారు. తమ కుమార్తె ప్రేమించిన అబ్బాయి ఇంటికి ఎవరూ వెళ్లకుండా నడిరోడ్డుపై గోడ కట్టారు ఆ తల్లిదండ్రులు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

నిలదీసిన గ్రామస్థులు..
కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ అనే అబ్బాయితో గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే, ఓ రోజు ఆ యువతి తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లిచేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పేసింది. అయితే, ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ జంట కాస్తా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అదే గ్రామంలో ఉన్న రత్నాకర్ ఇంటికి ఎవరైనా వెళ్లాలంటే ఆ యువతి ఇల్లు దాటే వెళ్లాలి. దాంతో ఆ తల్లిదండ్రులు కూతురు తమకు ఇష్టలేని పెళ్లిచేసుకుందని రత్నాకర్ ఇంటికి వెళ్లే దారిలో రాత్రికి రాత్రే నడిరోడ్డుపైనే అడ్డంగా ఓ గోడ కట్టేశారు. అది చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇది మీ రెండు కుటుంబాల సమస్య. మీరే పరిష్కరించుకోవాలి, కానీ ఇలా రోడ్డుపై గోడ కట్టడం ఏంటనీ చాలామంది ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు పోలీసులను సంప్రదించాలి కానీ, ఇలా చేయడం ఏంటని మరికొందరు వారిని నిలదీశారు. ప్రస్తుతం ఈ గోడకు సంబంధించిన ఫొటోలో కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.












Click it and Unblock the Notifications