ప్రవళిక ఆత్మహత్యకు అదే కారణం, రాజకీయం చేయొద్దు: తల్లి, సోదరుడు కీలక వ్యాఖ్యలు
వరంగల్: ఓ యువకుడి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ప్రవళిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి విజయమ్మ తెలిపారు. శివరామ్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందన్నారు. తన బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రవళిక ఆత్మహత్య విషయంలో రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న ప్రవళిక ఆత్మహత్యపై తాజాగా కుటుంబసభ్యులు తెలిపారు. తన కుమారుడు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారని యువతి తల్లి విజయమ్మ తెలిపారు. తమలాగా పిల్లలు కూలీ పనులు చేసుకోవద్దని.. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో కష్టపడి కోచింగ్ ఇప్పించామన్నారు.

కానీ, ఓ యువకుడు ప్రేమ పేరుతో ప్రవళికను వేధించాడని.. ఆ వేధింపులు తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ క్రమంలోనే తాము బిడ్డపోయిన బాధలో ఉన్నామని.. రాజకీయాలుంటే ఆయా పార్టీలు చూసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఉపయోగించుకోవడం సరికాదన్నారు ప్రవళిక తల్లి మర్రి విజయమ్మ.
'శివరామ్ వేధింపులు భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి.. వాడికి శిక్ష వేయండి' అని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేశారు.
శివరామ్ అనే యువకుడు తమ సోదరిని తరచూ వేధించేవాడని ప్రవళిక సోదరుడు మర్రి ప్రణయ్ తెలిపారు. చదువుకునే సమయంలో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడని.. కాల్ లిఫ్ట్ చేయకపోతే తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసేవాడని చెప్పారు. శివరామ్ వేధింపులు తట్టుకోలేక తమ సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. శివరాంను ఎన్కౌంటర్ చేస్తేనే ప్రవళిక ఆత్మ శాంతిస్తుందన్నాడు. ఈ క్రమంలోనే ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాజకీయ నేతలు వచ్చి తమను ఇబ్బందిపెడుతున్నారని.. సోదరి చనిపోయిన బాధలో తాము ఉంటే ఇంటికి వచ్చి రాజకీయాలు చేయడం తగదన్నారు.












Click it and Unblock the Notifications