గ్రేటర్ వరంగల్ ,ఖమ్మంతో పాటు ఐదు మున్సిపాలిటీల ఎన్నికల నగారా: నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మినీ పురపోరుకు తెలంగాణ రాష్ట్రం రెడీ అయింది . రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ వరంగల్ , ఖమ్మం నగరపాలక సంస్థ లతో పాటుగా సిద్ధిపేట, అచ్చంపేట ,జడ్చర్ల కొత్తూరు, నకిరేకల్ మునిసిపాలిటీల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకునే పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.

రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ .. ఏప్రిల్ 30 న పోలింగ్
ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాగా రేపటి నుండి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన ఆ తర్వాత 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కల్పించారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి, అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి .

వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు ఎన్నికలు
వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కు , గజ్వేల్ ,నల్గొండ, జల్ పల్లి, అలంపూర్ , బోధన్, పరకాల , బెల్లంపల్లి లో ఒక్కో వార్డుకు ఎన్నిక జరుగనుంది. ఇక సిద్దిపేట పాలకమండలి పదవీ కాలం నేటితో ముగియనుంది. నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల మునిసిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇప్పటికే రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీ లలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

గ్రేటర్ వరంగల్ లో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ
ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పోరుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నేడు డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ప్రకటించిన అధికారులు రేపట్నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎల్బీ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.