అది టచ్ చేస్తే వరంగల్ అగ్నిగుండమే: కడియం శ్రీహరిపైనా.. హరీష్ రావు సంచలనం!!
వంద రోజుల్లో తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు అనేక హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరిపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం తొలగింపు నిర్ణయంపై ఆయన మండిపడ్డారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పార్టీలో ఉత్సాహం పెరిగిందని, ఆయనకు గుణపాఠం చెప్పాలని, ఆయనను తరిమికొట్టాలని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీ ఎందుకు మారారో చెప్పాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి ఇంకో గ్రూపు పెడతారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కెసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అంటూ ఆరోపించారు. తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీకి ద్రోహం చేశారని, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అంతేకాదు కాంగ్రెస్ సర్కార్ కాకతీయ కళా తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు కీర్తి తోరణం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళా తోరణాన్ని తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు.
బిడ్డా రేవంత్..!
— BRS Party (@BRSparty) April 1, 2024
వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అయిన కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే.. కాంగ్రెస్ భూస్థాపితమే.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥🔥 pic.twitter.com/T2Y0IX6hyA
కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని ఫేక్ వార్తలు, లీకులు తప్ప రాష్ట్రంలో పాలన జరగడంలేదని రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు , బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని హరీష్ రావు సూచించారు.












Click it and Unblock the Notifications