ఏపీ సర్కారు అలా చేస్తుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు - మాజీ ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. సంస్థ భవిష్యత్ కార్యచరణతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్, ఆచార్య జయశంకర్ ల స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఏర్పడిందని.. ఈ సంస్థను ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తయింది అని వెల్లడించారు. ఈ ప్రయాణంలో ఎంతోమంది ఆశీస్సులు తమకు లభించాయని.. అనేక ఉద్యమాల ఫలితంగా ఎన్నో జీవోలు కూడా వచ్చాయని తెలిపారు. కేసీఆర్‌కు తాము అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కి తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ రెండు కళ్లలాంటివని చెప్పుకొచ్చారు. ఆయనపై ఈగ వాలినా మేం సహించం. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటే అది యావత్ తెలంగాణ ప్రజానీకానికి నోటీసులు ఇచ్చినట్లేనని స్పష్టం చేశారు.

గత పదేళ్ల కేసీఆర్ పాలనకు, ఇప్పటి కాంగ్రెస్ పాలనకు చాలా తేడా ఉందని కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా 'జై తెలంగాణ' అనాలని.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని కోరారు. కనీసం జూన్ 2న జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా ఆయన 'జై తెలంగాణ' నినాదం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతే కాకుండా జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం అన్నారు.
మరోవైపు బీజేపీపై కూడా కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించేలోగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.
గోదావరి-కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణకు రావాల్సిన నీళ్లు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు కవిత. నదుల అనుసంధానాన్ని కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నదీ జలాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications