తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం: నిధుల విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. రుణమాఫీ చెల్లింపులకు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుదలయ్యాయి. రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రుణమాఫీపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు గాను ఆర్థికశాఖ రూ.167.59 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 44,870 మంది రైతులకు లబ్దిచేకూరనుంది. బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితం అయ్యింది' అని హరీశ్ రావు పేర్కొన్నారు.

కాగా, రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారు. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీ మేరకు రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు.
తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లోనే రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు.
ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనుంది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రుణమాఫీ డబ్బులు అందుతుండటంతో లబ్ధిదారులైన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications