వీడు తండ్రేనా?: కన్న కూతుర్నే వ్యభిచారంలోకి దించాడు
హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నీ తానై ఆమెకు రక్షణగా ఉండాల్సిన ఓ కన్న తండ్రే.. వ్యసనాలకు బానిసై.. డబ్బు వ్యామోహంలో కన్నకూతురినే వ్యభిచారకూపంలోకి నెట్టాడు. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు బాలిక తండ్రితోపాటు ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత బాలికను కాపాడారు.

సెక్స్ రాకెట్ నిర్వాహకురాలితో పరిచయం
ఈ కేసు వివరాలను ఆదివారం డీఎస్పీ సురభి రాంగోపాల్‌రావు మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన నత్తి సుధారాణి అలియాస్ మాడుగుల సుధారాణి వ్యభిచారం నిర్వహించేది. నెలక్రితం మిర్యాలగూడ శాంతినగర్‌కు వచ్చిన ఆమెకు దుస్తులు ఇస్త్రీ చేసుకుని జీవించే భూతరాజు కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆయన సుధారాణికి తన ఇంటి సమీపంలో గదిని అద్దెకు ఇప్పించాడు.

కన్నకూతుర్నే అప్పగించాడు..
ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణకు.. మద్యం సేవించేందుకు సుధారాణి డబ్బులు ఇచ్చేది. మిర్యాలగూడ పట్టణంలోని ఏడుకోట్లతండాకు చెందిన పవన్, జబ్బార్, వాహెద్‌లు జూన్ 1న పవన్ సుధారాణికి ఫోన్‌చేసి తమకు అమ్మాయిని పంపాలని కోరారు. సుధారాణి ఆ విషయం కృష్ణకు చెప్పగా డబ్బుకోసం ఆశపడి తన కూతురినే పంపించాడు కృష్ణ. సుధారాణి ఆ బాలికను తీసుకుని బస్టాండు దగ్గరికి వెళ్లింది. అక్కడినుంచి పవన్‌కు చెందిన కారులో దేవరకొండ వైపు వెళ్లారు.

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
కారులో వాహెద్, జబ్బార్ కూడా ఉన్నారు. మార్గంమధ్యలో డబ్బు విషయంలో వీరు గొడవపడ్డారు. వెంటనే సుధారాణి బాలికతో సహా కారు దిగి రోడ్డుపై వెళ్తున్న లారీలో ఎక్కి గోవాకు వెళ్లింది. తరువాత కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొన్నాళ్లు, పొన్నురు సమీపంలోని తాటికల్లు గ్రామంలో కొన్ని రోజులు మకాం వేసింది. కాగా, జూన్ 2న బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా సుధారాణిని పట్టుకున్నారు.

నిందితుల అరెస్ట్
బాలికను అపహరించిన రోజున భూతరాజు కృష్ణ సుధారాణితో ఫోన్లో 58 సార్లు మాట్లాడినట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. నిందితులు మాడుగుల సుధారాణి, భూతరాజు కృష్ణ, మాళొతు పవన్, మహ్మద్ వాహెద్‌లను ఆదివారం అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు జబ్బార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications