బుద్ధుడి బోధనల్లో జీవిత రహస్యం..మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన జీవిత సత్యం.!

మనిషి జీవితంలో నిజమైన మార్పు బయట ప్రపంచాన్ని మార్చడం ద్వారా కాదు.. తనలోని ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనను సరిదిద్దుకోవడం ద్వారా ప్రారంభమవుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం ఆత్మపరిశీలనకు కేటాయిస్తే వ్యక్తిత్వంలో పరిపక్వత వస్తుందని, తద్వారా కుటుంబాలు, సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 'మన కాలం బుద్ధుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

'మన కాలం బుద్ధుడు' పుస్తకావిష్కరణ
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ అరవింద్ యాదవ్ రచించిన 14వ దలైలామా జీవిత చరిత్ర 'మన కాలం బుద్ధుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. పుస్తక రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్‌తో పాటు ఈ రచనను తెలుగులోకి అనువదించిన సీనియర్ జర్నలిస్టు మెరుగుమాల నాంచారయ్యను అభినందించారు.

former-vice-president-venkaiah-naidu-highlights-buddhas-teachings-at-manakalam-buddhudu-book-launch

మాతృభాషలో చదివినప్పుడు విషయాలు మరింత సులభంగా అర్థమవుతాయని, గొప్ప వ్యక్తుల జీవితాలు, వారి ఆలోచనా విధానాలు ప్రజలకు చేరువ కావడానికి ఇలాంటి అనువాద రచనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. దలైలామా జీవితంలోని ఆధ్యాత్మికత, మానవీయ విలువలు, తాత్విక చింతనను ఈ పుస్తకం ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సమకాలీన చరిత్రను, మహనీయుల జీవిత విశేషాలను ప్రతిబింబించే పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

ప్రతిరోజూ ఆత్మపరిశీలన చేసుకోవాలి
వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలంటే పెద్ద పెద్ద సంస్కరణలు అవసరం లేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని రోజంతా చేసిన పనులను, తీసుకున్న నిర్ణయాలను ఒకసారి సమీక్షించుకోవాలని సూచించారు. మన ఆలోచనలు సరైన దిశలో ఉన్నాయా? మన ప్రవర్తన ఇతరులను బాధించిందా? మనం తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు సమంజసమైనవి? అనే ప్రశ్నలు వేసుకోవాలని చెప్పారు.

ఇలాంటి చిన్న ప్రయత్నం వ్యక్తిలో ఆలోచనా పరిపక్వతను పెంచుతుందని వివరించారు. ఒక్కొక్కరిలో ఈ మార్పు మొదలైతే కుటుంబాల్లో గొడవలు తగ్గుతాయని, సమాజంలో విద్వేషాలు తొలగి పరస్పర గౌరవం పెరుగుతుందని అన్నారు. శాంతియుత వాతావరణం ఏర్పడినప్పుడే అభివృద్ధికి సరైన పునాదులు పడతాయని స్పష్టం చేశారు.

సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా.. సత్యాన్వేషణే మార్గం
గౌతమ బుద్ధుడి జీవితాన్ని ప్రస్తావిస్తూ సిద్ధార్థుడి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు అన్నారు. రాజభోగాలు, అధికారం, సంపద, కుటుంబ సౌఖ్యాలను వదిలి సత్యాన్వేషణ కోసం సిద్ధార్థుడు బయలుదేరారని గుర్తుచేశారు. ఎన్నో సంవత్సరాల సాధన, అన్వేషణ తర్వాత బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారని వివరించారు.

అయితే జ్ఞానోదయం అనేది కేవలం ఆధ్యాత్మిక సాధకులకే పరిమితం కాదని, సామాన్యులు కూడా తమ దైనందిన జీవితంలో లౌకిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మన తప్పులను గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం, ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించడం ద్వారా జీవితంలో ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కరుణ, అహింసకు ప్రతిరూపం దలైలామా
14వ దలైలామా వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన కేవలం బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని, కరుణ, సహనం, అహింస, శాంతి, మానవీయ విలువలకు ప్రతిరూపమని వెంకయ్యనాయుడు కొనియాడారు. గౌతమ బుద్ధుడి బోధనలను తన జీవన విధానంలో ఆచరించి చూపించిన వ్యక్తిగా దలైలామాను అభివర్ణించారు.

శ్రీరామచంద్రుడు జన్మభూమిని స్వర్గంతో పోల్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. దలైలామాకు కూడా తన మాతృభూమి టిబెట్ పట్ల ఎంతో ప్రేమ, అనుబంధం ఉన్నాయని అన్నారు. చిన్న వయసులోనే టిబెట్ ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఆయన, అక్కడి ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని వివరించారు. అనివార్య పరిస్థితుల్లో టిబెట్‌ను విడిచి భారత్‌లో ఆశ్రయం పొందాల్సి రావడం, మాతృభూమికి దూరంగా ప్రవాస జీవితం గడపడం ఎంతో బాధాకరమైన విషయమని పేర్కొన్నారు.

బౌద్ధం, సనాతన ధర్మాల్లో ఎన్నో సారూప్యతలు
భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక సంప్రదాయాల్లో బౌద్ధ ధర్మానికి ప్రత్యేక స్థానం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. బౌద్ధం భారత గడ్డపైనే ఆవిర్భవించిందని గుర్తుచేస్తూ, గౌతమ బుద్ధుడి జీవితంతో ముడిపడిన లుంబినీ, బోధ్‌గయ, సారనాథ్, కుశీనగర్ ప్రాంతాల ప్రాధాన్యతను వివరించారు.

బౌద్ధ, సనాతన ధర్మ సంప్రదాయాల్లో అహింస, కరుణ, దయ, ఆత్మనిగ్రహం, సత్యాన్వేషణ వంటి విలువలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భారతీయ తాత్విక చింతన నుంచి ఉద్భవించిన బౌద్ధ ధర్మం ప్రపంచానికి మానవీయతతో కూడిన జీవన మార్గాన్ని పరిచయం చేసిందని పేర్కొన్నారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార భిక్షువుల బృంద నాయకులు భిక్కు బుద్ధ పాల, టిబెటన్ పండితులు, బౌద్ధ భిక్షువు ప్రొఫెసర్ గేషే నవాంగ్ సామ్తెన్, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఆర్టీఐ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి, రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్, అనువాదకులు మెరుగుమాల నాంచారయ్య, అజు పబ్లికేషన్స్ ప్రచురణకర్త ఎర్రం శ్వేత, డెక్కన్ క్రానికల్ కార్టూన్ ఎడిటర్ షేక్ సుభాని, సీనియర్ జర్నలిస్టు, యాంకర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+