ఎలక్ట్రిక్ గీజర్ లో రూ.2.71 కోట్ల గంజాయిని దాచాడు.. అక్కడ ఎలా పెట్టావ్ రా..!
పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా తెలంగాణలోకి గంజాయి, డ్రగ్స్ ను రాకుండా మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. ఇతర దేశాల నుంచి అనేక రూపాల్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవలి కాలంలో చాలామందే గంజాయితోపాటు అక్రమ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది.
తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమవడం కలకలం రేపుతోంది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర దాదాపు రూ.2.71 కోట్ల విలువ చేసే గంజాయి లభ్యం అయింది. ఈ మేరకు ప్రయాణికుడి చెక్-ఇన్ లగేజీలోని ఎలక్ట్రిక్ వాటర్ గీజర్ లో అత్యంత తెలివితో దాచి తరలిస్తున్న సుమారు 7.75 కిలోల హై-గ్రేడ్ హైడ్రోపోనిక్ వీడ్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ముందస్తుగా వచ్చిన సమాచారంతోనే ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు.. ప్రయాణికుడి చెక్ ఇన్ బ్యాగేజిలో ఎలక్ట్రిక్ గీజర్ గుర్తించామని తెలిపారు. అయితే అనుమానం వచ్చి గీజర్ ను తెరిచి పరిశీలించగా 73 ప్యాకెట్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ఈ హై గ్రేడ్ హైడ్రోపోనిక్ వీడ్ విలువ అంతర్జాతీయ అక్రమ మార్కెట్ లో సుమారు రూ.2.71 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

అలాగే స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను NDPS చట్టం, 1985 నిబంధనల ప్రకారం సీజ్ చేశామన్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ప్రయాణికుడిని అదే చట్టం కింద అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఇక ఈ నెట్ వర్క్ వెనుక ఉన్న స్థానిక ముఠాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలికాలంలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోని అధికారులు అప్రమత్తం అయ్యారు. డ్రగ్స్ అక్రమ సరఫరాపై నిఘా పెంచారు.












Click it and Unblock the Notifications
