లక్షకే తులం బంగారం..కట్ చేస్తే జరిగిందిదే!
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో మరోసారి బంగారం మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకు బంగారం ఇస్తామని అమాయకులను నమ్మించి భారీ మొత్తం డబ్బు మోసం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. లక్ష రూపాయలకే ఒక్క తులం బంగారం బిస్కెట్ ఇస్తామని ఆశ చూపి, రూ.47.40 లక్షలు వసూలు చేసి మాయమైన కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే బంగారం
కామేపల్లి మండలం కెప్టెన్ బంజార గ్రామానికి చెందిన బానోతు అఖిల్ అనే యువకుడు ఈ మోసానికి ప్రధాన బాధితుడు. ఈ నెల 10వ తేదీన ఇద్దరు వ్యక్తులు అతని ఇంటికి వచ్చి తమ వద్ద నిజమైన బంగారం ఉందని, మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా ఇస్తామని చెప్పి నమ్మించారు. వారిలో ఒకరు స్థానికుడైన బానోతు సాయికుమార్, మరొకరు ఏపీ నంద్యాల జిల్లాకు చెందిన బోగా లక్ష్మీనారాయణ.

లాభం వచ్చే ఆఫర్ అని నమ్మి 47న్నర లక్షలు ఇచ్చి న ఆరుగురు
తమ మాటలపై నమ్మకం కోసం చిన్న బంగారు ముక్కను అఖిల్‌కు ఇచ్చి టెస్ట్ చేసుకోమన్నారు. ఆ ముక్క నిజమైన బంగారమేనని తేలడంతో అఖిల్ వారి మాటలు పూర్తిగా నమ్మాడు.
అఖిల్ ఈ లాభదాయక ఆఫర్ గురించి తన బంధువులు, స్నేహితులకు చెప్పాడు. దీంతో మరో ఐదుగురు వ్యక్తులు కూడా ఆసక్తి చూపారు. ఈ నెల 18న సాయికుమార్, లక్ష్మీనారాయణలు చెప్పిన ప్రదేశానికి వెళ్లి బాధితులు రూ.47,40,000 నగదు అందజేశారు.
బంగారం తెచ్చి ఇస్తామన్న వాళ్ళు పరారీ.. పోలీస్ కేసు
బంగారం తీసుకొస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరూ తిరిగి రాలేదు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన అఖిల్ కామేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు బానోతు సాయికుమార్, బోగా లక్ష్మీనారాయణలపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నందున వారి అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ మోసం ద్వారా బాధితులు తాము కష్టించి సంపాదించిన డబ్బును కోల్పోయారు.
ఆఫర్లను నమ్మి బంగారం కొనొద్దు .. పోలీసుల హితవు
ఇలాంటి బంగారం మోసాలు ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. తక్కువ ధరకు బంగారం, వజ్రాలు, వాహనాలు అందిస్తామని చెప్పి మోసం చేసే ముఠాలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, ఎలాంటి ఆకర్షణీయ ఆఫర్లకు నమ్మకూడదని సూచిస్తున్నారు.మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పేవారిని సందేహించాలని, ఇలాంటి లావాదేవీలు చేసేటప్పుడు పోలీసుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications