అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్: శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమల (Sabarimala) క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్-జనవరి మాసాల్లో వివిధ తేదీల్లో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్లను నడపున్నట్లు తెలిపింది.
వివిధ తేదీల్లో రాకపోకలు కొనసాగించే ఆ రైళ్ల నెంబర్లు, తేదీలతోపాటు పలు వివరాలను మంగళవారం ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అత్యధికంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు వెళతారు. మరికొంతమంది మాల వేసుకోకుండానే అయ్యప్పను దర్శించుకునేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలోనే ప్రత్యేక రైళ్లను అధికారులు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ-కొల్లం, కొల్లం-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాచిగూడ కొల్లం (07109) రైలు డిసెంబర్ 18, 25, జనవరి 1, 8, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. కొల్లం నుంచి కాచిగూడకు డిసెంబర్ 20, 27, జనవరి 3, 11, 17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందని తెలిపింది. కాచిగూడ - కొల్లం రైలు ప్రతి సోమవారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30గంటలకు కొల్లం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజున ఉదయం 10.45 గంటలకు బయలుదేరి గురువారం కాచిగూడకు చేరుతుంది.
Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR
— South Central Railway (@SCRailwayIndia) December 12, 2023
రైలు రెండుమార్గాల్లో ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుర్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పడి, ఈరోడ్, పాల్ఘట్, ఎర్నాకులం టౌన్, కాయంకులం, తదితర రైల్వేస్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకల సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం నవంబర్ 17న తెరుచుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications