ఆ ప్రాంతవాసులకు భారీ రైల్వే ప్రాజెక్ట్ తో మహర్దశ!
తెలంగాణ రాష్ట్రంలో అందులో రైల్వేలో ఉత్తర, దక్షిణ భారతదేశాల కూడలిగా చెప్పుకొనే కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో మార్చి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనులు మొదలవుతాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య తాజాగా శుభవార్త చెప్పారు.
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరుగుతున్న పనుల పురోగతి
కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజుతో కలిసి సందర్శించిన కడియం కావ్య రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరుగుతున్న పనుల పురోగతిని మౌలిక వసతుల అభివృద్ధిని విభాగాల వారీగా జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపైన సమగ్రంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం కావ్య కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 30 సంవత్సరాల కల అని, అది ఇప్పుడు నెరవేరబోతుందన్నారు.

స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరతా
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఇది సాధ్యమైందని కడియం కావ్య స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రయత్నం చేస్తానని, యూనిట్ లోని వివిధ సర్వీసులలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరతానని ఆమె అన్నారు. స్థానికులకు అన్యాయం జరగకుండా చూస్తానని అన్నారు.
ప్రతి సంవత్సరం 600 కోచ్ లు
భూ బాధితులకు స్థానికులకు ఉద్యోగాలపైన పార్లమెంటు సమావేశాలలో మాట్లాడతానని కడియం కావ్య వెల్లడించారు. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ప్రతి సంవత్సరం 600 కోచ్ లు తయారవుతాయని వచ్చే మార్చి నెలలో ఇది కార్యకలాపాలు సాగించడం మొదలవుతుందని కడియం కావ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడ పనులలో జాప్యం జరగకుండా చూడాలని చెప్పిన ఎంపీ కడియం కావ్య స్థానికులకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
దేశ రైల్వే వ్యవస్థకు ఈ యూనిట్ ఏర్పాటు
యూనిట్ ఏర్పాటు పనులు మరింత వేగవంతంగా చేయాలని ఆమె సూచించారు. దేశ రైల్వే వ్యవస్థకు ఈ యూనిట్ ఏర్పాటుతో ఒక ముఖ్యమైన ఉత్పాదక కేంద్రం ఏర్పాటు అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తొందరగా పూర్తి చేసి, త్వరితగతిన అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంపీ కడియం కావ్య వెల్లడించారు.












Click it and Unblock the Notifications