నక్కతోక తొక్కిన ఓరుగల్లు వాసులు.. సీఎం రేవంత్ వరాలు!
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఓరుగల్లు వాసులకు వరాల జల్లు కురిపించింది. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, పర్యటనకు ముందే వరుస శుభవార్తలు చెప్పింది.
వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ఎట్టకేలకు ఆమోదం లభించింది. వరంగల్ మహానగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయడం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం ఆమోదించింది.
వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
నగరాభివృద్ధికి 1972లో తయారుచేసిన మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇప్పటికీ అమల్లో ఉండగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కుడా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇది దాదాపు 10ఏళ్లకు పైగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో కొత్త మాస్టర్ ప్లాన్ ఉండగా, గత ఎన్నికలలో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు ఎట్టకేలకు వరంగల్ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2050 విజన్ తో మాస్టర్ ప్లాన్
మాస్టర్ ప్లాన్ ప్రతి 20ఏళ్లకు ఒకసారి అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయవలసి ఉండగా గత 52ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ మార్పుకు నోచుకోలేదు. అయితే వరంగల్ నగర రూపురేఖల్లో ఎన్నో మార్పులు రాగా, పదేళ్ళ క్రితం 2041 విజన్ తో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2050 విజన్ తో మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
మామునూరు విమానాశ్రయ నిర్మాణంపై గుడ్ న్యూస్
దీంతో వరంగల్ లో భారీ ప్రాజెక్టులో ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్టుంది. ఇదిలా ఉంటే దీంతోపాటే వరంగల్ వాసుల దశాబ్దాల కల వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి కీలక అడుగులు పడుతున్నాయి. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 280.30 ఎకరాల భూమి సేకరణ కోసం భూములు ఇస్తున్న రైతుల కోసం రూ. 205 కోట్లు మంజూరు చేసింది.
రన్ వే నిర్మాణానికి ఏఏఐ కి భూమి ఇచ్చేందుకు అనుమతి
అలాగే 253 ఎకరాల భూమిని ఉచితంగా ఏవియేషన్ అధారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించేందుకు జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టును ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించనుంది. A-320 విమానాల సాంకేతికతకు అనుగుణంగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ చేపడతారు.ఈ క్రమంలో, రూ. 205 కోట్లు మంజూరు చేయటంతో పాటు, రన్ వే విస్తరణ కోసం AAIకు అప్పగించేందుకు జిల్లా కలెక్టర్, వరంగల్‌కు అనుమతి ఇచ్చారు.
ఓరుగల్లు వాసుల్లో హర్షం
ఇప్పటికే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ మామునూరు ఎయిర్‌పోర్టు ప్రారంభానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించింది.ఈ నిర్ణయం వలన వరంగల్ ప్రాంతంలో విమాన రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఓరుగల్లు వాసుల కల నెరవేరబోతున్న కారణంగా స్థానికంగా హర్షం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఓరుగల్లు వాసులు ఈ శుభావార్తలతో నక్కతోక తొక్కినట్టు కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications