తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ల ఉచిత పంపిణీ- లింక్ ఇదే
హైదరాబాద్: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే.
ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అభిమానులను పలకరించబోతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్.

ఈ సాయంత్రం ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ప్రభాస్- విల్లునెక్కుపెట్టారు. ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్- యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపటికే రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించింది. 16వ తేదీన సినిమా విడుదల కాబోతోందని దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముగించుకున్న మరుసటి రోజే అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 10,000పైగా ఆదిపురుష్ సినిమా టికెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్- తన సొంత ఖర్చులతో ఈ ఈ సినిమా టికెట్లను ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10,000లకు పైగా ఆదిపురుష్ టికెట్లను ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. దీనికోసం వారు గూగుల్ ఫామ్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ లింక్ https://bit.ly/CelebratingAdipurush. మొదటగా భర్తీ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత పద్ధతిన టికెట్లను పంపిణీ చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే- ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్లల్లో కూడా ఒక సీట్‌ను ఖాళీగా ఉంచాలని చిత్రం యూనిట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచే ఓ సీట్ ఖాళీగా ఉంటుంది. ఆ సీట్‌ను హనుమంతుడికి కేటాయించింది. ఆంజనేయస్వామి స్వయంగా వచ్చి ఈ సినిమాను చూస్తాడని యూనిట్ విశ్వసించడమే దీనికి కారణం. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికీ హనుమంతుడు విచ్చేస్తాడని భక్తులు నమ్ముతుంటారు.
ఆ సంప్రదాయాన్ని, నమ్మకాన్ని గౌరవిస్తూ- రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ను సినిమాను చూడటానికి హనుమంతుడు వస్తాడని, రామభక్తునికి గౌరవ మర్యాదలను కల్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టామని పేర్కొంది. ఈ మేరకు యూవీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్‌ను హనుమంతుడి సమక్షంలో వీక్షిద్దామని సూచించింది.












Click it and Unblock the Notifications