జూన్ 2న ప్రజలకోసం భారీ కానుక ఇస్తున్న రేవంత్ సర్కార్.. తెలంగాణా అంతా పండుగే!
రాష్ట్ర రహదారి నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే దిశగా తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది. రూ.13,006 కోట్ల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (HAM) రోడ్ల నిర్మాణానికి ఇటీవల తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 441 ముఖ్యమైన రోడ్లను 34 ప్యాకేజీలుగా విభజించి అమలు చేయనున్నారు.
ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యం
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలతో పాటు మారుమూల గ్రామాలను కూడా అనుసంధానం చేసి, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండర్లలో కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేయడంతో సమస్య ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని, ఖర్చును 5 శాతం ఎక్సెస్ పరిధిలో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ప్రజాధనం ఆదా చేసేలా పలు కీలక నిర్ణయాలు
ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కొన్ని ముఖ్యమైన రాయితీలు అందించింది. గుత్తేదారులు చేపట్టే పనులపై 9.30 శాతం GSTని భవిష్యత్తులో ప్రభుత్వమే రీయింబర్స్ చేయనున్నట్టు వెల్లడించింది. అలాగే రోడ్ల పెట్రోలింగ్ మరియు అంబులెన్స్ సేవల కోసం అయ్యే 4.46 శాతం ఖర్చును కూడా ప్రభుత్వం భరించడం ద్వారా టెండర్లు సమ్మతమైన ధరల్లోకి రావడం జరిగింది. ఈ నిర్ణయాల వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
గ్రామీణ రోడ్లకు భారీ కేటాయింపు
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మరో 7,450 కిలోమీటర్ల గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. మొదటి దశలో 2,162 గ్రామాల్లో అంతర్గత రోడ్లు మరియు ముఖ్య రహదారులను ఆధునీకరించనున్నారు. ఇందుకోసం 17 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ భారీ రోడ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
హ్యామ్ రోడ్లు..మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక మైలురాయి
ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో రవాణా రంగం సరికొత్త రూపం సంతరించుకుంటుంది. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభం అవుతుంది. అలాగే ప్రమాదాలు తగ్గి, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఈ నిర్ణయం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక మైలురాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యం పెట్టుకుంది.












Click it and Unblock the Notifications