ఆ మాట నిలబెట్టుకోకుంటే రాజీనామా చేస్తావా?: రేవంత్‌కు హరీశ్ సవాల్
సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో హరీశ్ సమావేశమమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోపు రూ. 39 వేల కోట్లు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? హరీశ్ రావు సవాల్ విసిరారు.
ఇప్పటివరకు రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదని, ఇంకా పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తా అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తం అవుతాయన్నారు. భువనగిరి కాంగ్రెస్ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తనను ఎందుకు ఓడించాలో చెప్పాలంటున్నారు. వారిని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2500 సహాయం, కల్యాణ లక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు హరీశ్ రావు సూచించారు.
ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానంటూ, ఎవరి చెవుళ్లో పువ్వు పెడుతున్నారు. ఏకకాలంలో రూ.39 వేల కోట్లు రుణమాఫీ చేయకపోతే, సీఎం పదవికి రాజీనామా చేయటానికి రేవంత్ రెడ్డి మీరు సిద్ధమా? ఎన్నికల ప్రచారాల్లో దేవుడ్ని వాడుకోవటం కాదు. మీరు వంద రోజుల్లో ఈ హామీ ఎందుకు నెరవేర్చలేదు. ప్రమాణ స్వీకారం అనంతరమే చేస్తానని మాట ఏమైంది? అన్ని అబద్ధపు మాటలు చెప్పుకుంటూ మీ ప్రభుత్వం అధికారమెక్కింది అంటూ కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు హరీశ్ రావు.
రేవంత్ రెడ్డి అంటే మాటల కూతలు, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కరవు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రేవంత్ రెడ్డి మాటలు సీఎం స్థాయికి తగినట్లుగా లేవని హరీశ్ అన్నారు.












Click it and Unblock the Notifications