అల్లు అర్జున్ తరువాత అరెస్ట్ లిస్టులో సినీ ప్రముఖుడు..!?
తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారింది. సినిమా ధియేటర్ వద్ద తొక్కిసలాట లో మహిళ మరణంతో అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, దీని పైన స్పందించిన సీఎం రేవంత్ చట్టం ముందు అందరూ సమానమేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో, ఇప్పుడు పోలీసుల చర్య పైన ఉత్కంఠ మొదలైంది.
రెండు రోజుల క్రితం వరకు మోహన్ బాబు ఇంట్లో రచ్చ కొనసాగింది. ఆ సమయంలోనే ఒక టీవీ జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయటం వైరల్ గా మారింది. దీని పైన పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసారు. కాగా, ఈ దాడి వెనుక కారణాలను వివరించిన మోహన్ బాబు తాజాగా క్షమాపణ చెప్పారు. ఇక, ఈ రోజు సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ మరో సంచలనంగా మారిన సమయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది.

మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. అటు అల్లు అర్జున్ విషయంలో పోలీసులు అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొక్కిసలాట లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరదినే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, కొత్త సినిమా విడుదల సమయంలో ప్రముఖ హీరో థియేటర్ వద్దకు వస్తున్న సమాచారం తమకు లేదని.. సడన్ గా రావటమే తొక్కిసలాటకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత.. మోహన్ బాబు ముందస్తు బెయిల్ హైకోర్టు తిరస్కరణ తో పోలీసులు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. చట్టం ముందు అంద రూ సమానమే అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈ సమయంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications