పబ్‌లో డ్యాన్సర్, భర్త అనుమానం: కాళ్లు, చేతులు కట్టేసి గుడ్డలు కుక్కి నిప్పంటించి చంపేశాడు
హైదరాబాద్: సంతోష్ నగర్‌లో దారుణం జరిగింది. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజులకు అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆమెను దారుణంగా మంటల్లో కాల్చి చంపాడు. ఈ హృదయ విదారక సంఘన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
పంజాబ్‌క చెందిన 26 ఏళ్ల సానియా బేగం నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. నాగోల్‌లో ఉంటూ ఓ పబ్‌కు చెందిన ఆర్కెస్ట్రాలో డ్యాన్సర్‌గా, సింగర్‌గా చేరింది. అదే బృందంలో పని చేస్తున్న సంతోష్ నగర్‌కు చెందిన 28 ఏళ్ల షేక్ సల్మాన్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది.

ఒప్పించి పెళ్లి చేసుకున్నారు
సానియా, సల్మాన్‌లు పెద్దలను ఒప్పించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇద్దరిదీ ఒకే వృత్తి. ఇద్దరూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చేవారు. దీంతో కొడుకు సంరక్షణ బాధ్యతను సల్మాన్ తల్లిదండ్రులు తీసుకున్నారు. కుటుంబ ఖర్చులు పెరుగుతుండటంతో సానియా పబ్బులలో డ్యాన్సుతో పాటు పాటలు కూడా పాడుతోంది. దీంతో ఎక్కువ సమయం అక్కడే ఉండేది.

సెల్ ఫోన్లో మాట్లాడటంతో అనుమానం
ఇది ఇద్దరు దంపతుల మధ్య విభేదాలకు, అనుమానాలకు తావిచ్చింది. తాను ఇంట్లో లేని సమయంలో భార్య సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నదని సల్మాన్‌కు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సల్మాన్, సానియా ఇంటికి వచ్చారు. అప్పటికే సల్మాన్ తాగి ఉన్నాడు.

కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి నిప్పు అంటించాడు
మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సల్మాన్.. భార్య సానియాతోను బలవంతంగా మద్యం తాగించాడు. అర్దరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో మత్తులో ఉన్న భార్య కాళ్లు, చేతులు కట్టేశాడు. నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం కిరోసిన్ పోసి నిప్పు అంటించి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు.

పోలీసులకు సమాచారం
ఇంట్లో నుంచి వాసన రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగు చూసింది. సల్మాన్ గతంలోనే ఓ హత్య కేసులో నిందితుడు అని పోలీసులు తెలిపారు. పహాడీషరీఫ్ పోలీసులు అయిదేళ్ల క్రితం సల్మాన్‌ను అరెస్ట్ చేశారన్నారు. కాగా, తర్వాత నిందితుడు లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications