హైదరాబాద్ లో ఈ రద్దీ రూట్ లో ఇకపై వన్ వే: సజ్జనార్ గ్రౌండ్ రిపోర్ట్
హైదరాబాద్ లో పెరుగుతున్న వాహన రద్దీకి శాశ్వత పరిష్కారం చూపడానికి నగర ట్రాఫిక్ పోలీసులు మరో ప్లాన్ ను సిద్ధం చేశారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో విజయవంతంగా అమలులో ఉన్న వన్ వే ట్రాఫిక్ విధానాన్ని రవీంద్రభారతి- లక్డీకాపూల్ బస్టాప్ మధ్య కూడా తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మెహదీపట్నం, లక్డీకాపూల్, ఖైరతాబాద్ వైపు వెళ్లే లక్షలాది వాహనదారులకు ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ నుంచి భారీ ఉపశమనం లభించనుంది.
ఈ వన్ వే ట్రాఫిక్ రూట్లను ప్రత్యక్షంగా పరిశీలించడానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సహా ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు కూడా. ద్వారకా హోటల్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్, హెచ్డీఎఫ్సీ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, వాహనాల కదలికలను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులపై సమగ్ర అంచనాకు వచ్చారు.

ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించిన ఈ నయా రూట్ ప్లాన్ ప్రకారం.. నాంపల్లి వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు రవీంద్రభారతి వైపు నేరుగా వెళ్లడానికి అనుమతి ఉండదు. ఈ వాహనాలను హెచ్డీఎఫ్సీ జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్ మీదుగా సెక్రటేరియట్ జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు. మరోవైపు నిరంకారి జంక్షన్ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి రోడ్డు మీదుగా ఆయా వాహనాలు సాగాల్సి ఉంటుంది.
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వద్ద రవీంద్రభారతి వైపు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. ఈ వాహనాలు ఓల్డ్ కంట్రోల్ రూమ్ వద్ద యూటర్న్ తీసుకుని అసెంబ్లీ గేట్ నంబర్ 3, హెచ్డీఎఫ్సీ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే వాహనదారులను ద్వారకా హోటల్, కామాత్ హోటల్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఫలితంగా చాలా ఏళ్లుగా మూసివేసి ఉన్న గన్ పార్క్ రోటరీ యూటర్న్‌ను తిరిగి పునఃప్రారంభించినట్టవుతుంది.
ఈ ప్రతిపాదిత మార్పులను అమలు చేయడానికి ముందు రవాణా రంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ వాటర్ వర్క్స్, డిస్కమ్ అధికారులతో త్వరలోనే ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం నుంచి తుది అనుమతి లభించిన తర్వాత, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ వన్ వే విధానాన్ని ట్రయల్ రన్ గా అమలు చేస్తారు. అది విజయవంతమైతే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తారు.
ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చేసేందుకు ఇవాళ లక్డీకాపూల్ పరిసరాల్లో బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించాను.ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్లలో రోడ్ల స్థితిగతులు, రద్దీ తీవ్రతను పరిశీలించాం. ఆయా కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తగా వన్-వే విధానం అమలుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించాం.ఈ విధానంపై త్వరలోనే జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటాం. వాహనదారులకు ఇబ్బంది లేకుండా తొలుత దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సరళీకరణకు వన్-వేలను పరిశీలిస్తున్నాం. ట్రాఫిక్ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు నగరవాసులు సహకరించాలని కోరుతున్నాను.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) November 6, 2026
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇతర ప్రధాన రద్దీ జంక్షన్లలో కూడా వన్ వే ట్రాఫిక్ విధానాన్ని విస్తరింపజేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తోన్న సమయంలో వాహనదారుల నుంచి ఫీడ్ బ్యాక్ ను కూడా తీసుకోనున్నారు. వారి నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా అవసరమైతే ఇందులో సవరణలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
