సీసీటీవీ పుటేజి ఆధారంగా బాలుడి కిడ్నాప్‌ను చేధించిన పోలీసులు (ఫోటో)
హైదరాబాద్: ఓ యాచకురాలిని నమ్మించి, ఆమె 11 నెలల కొడుకును కిడ్నాప్ చేసిన ఇద్దరిని అబిడ్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారాలతో కేసును పోలీసులు ఛేదించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 10వ తేదీన అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో11 నెలల బాలుడు కిడ్నాపయ్యాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన మహ్మద్ యూనీస్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్. 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి తలాబ్‌కట్ట ప్రాంతంలో నివాసముంటున్నాడు. నిజామాబాద్‌లో ఉండే ఇతడి మరదలు హతియ బేగంకు పిల్లలు లేకపోవడంతో ఒక మగపిల్లవాడిన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని అందుకు గాను రూ. 80 వేలు ఇచ్చింది.
దీనితో యూనీస్ అతని ఇంటి సమీపంలో ఉండే ఆటోడ్రైవర్ మహ్మద్ రియాజ్ సహాయాన్ని కోరాడు. ఇద్దరు కలిసి ప్లేట్ల బురుజులోని మహిళ ప్రసూతి ఆసుపత్రి వద్ద ప్రయత్నించారు. మగ శిశువును కిడ్నాప్ చేయాలనుకున్నా అది విజయవంతం కాలేదు. కొంత నగదు చెల్లించి బాలుడిని కొన్నాలనుకున్నా అదీ ఫలించలేదు.

లంబాడ తండాలకు కూడా వెళ్లివచ్చినా లాభం లేకుండా పోయింది. దీంతో ఈ నెల 10వ తేదీన డీఆర్‌డీఎల్ ఎక్స్ రోడ్డులో మగపిల్లవాడిని ఎత్తుకొని బిక్షాటన చేస్తున్న మహ్మదీ బేగంతో మాట్లాడారు. మా అంటీకి ఆరోగ్యం బాగోలేదని, పేదవారికి బట్టలు ఉచితంగా ఇస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మించారు.
ఆమెను ఆటోలో ఎక్కించుకొని కాచిగూడలో 400 వెచ్చించి బాలుడికి డ్రెస్ కొన్నారు. తర్వాత బ్యాంక్ స్ట్రీట్‌కు వచ్చి ఆమెకు రూ.3 వేలు పెట్టి బట్టలు ఇప్పించారు. ఆమెకు వారిపై పూర్తి నమ్మకం కల్గింది. దీనితో అబిడ్స్‌లోని హాలీవుడ్ ఫుట్‌వేర్ ముందుకు వచ్చి ఆటో ఆపారు. ఆమెను చెప్పులు కొనుక్కోమ్మని డబ్బులు ఇచ్చారు.
బాలుడిని ఆటోలోనే వదిలి ఆమె ఫుట్‌వేర్ లోపలికి వెళ్లి వచ్చేసరికి బాలుడితో పాటు ఆటోలో ఉడాయించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించారు. అయితే నెంబర్‌ను నిందితులు మార్పింగ్ చేయడంతో సీసీ కెమెరాల పుటేజీలతో గుర్తించడం కష్టమయింది.
వీడియో అనలైజింగ్ సాఫ్ట్‌వేర్‌తో ఆటోకు సంబంధించిన కొంత సమాచారాన్ని సేకరించి నిందితులను పట్టుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లివద్దకు చేర్చారు. బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకురావడంతో దత్తతకు సంబంధించిన సరైన పత్రాలు లేవంటూ హతియ బేగం బాలుడిని తీసుకోవడానికి నిరాకరించింది.












Click it and Unblock the Notifications