
జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి ఆత్మీయ పలకరింపులు; ఫోటోలకు ఫోజులు; 20నిముషాలపాటు ఏం జరిగిందబ్బా!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఎల్పీ కార్యాలయంలో ఒకరికొకరు ఎదురు పడిన వారు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు.ఇంతకాలం ఉప్పూ, నిప్పులా చిటపటలాడిన ఇద్దరు నేతలు ఈరోజు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
Recommended Video
టీఆర్‌ఎస్‌లో చేరే ఉద్దేశం లేదు; బీజేపీ మాటే లేదన్న జగ్గారెడ్డి; సంగారెడ్డి ఎమ్మెల్యే రూటే సపరేటు!!

మీడియా ముందుకు ఆత్మీయంగా పలకరించుకుంటూ జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి
సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఎదురుపడగానే జగ్గారెడ్డి ఆయనను ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు నేతలను ఒక చోట చూసిన మీడియా ప్రతినిధులు వారి వద్దకు వెళ్లగా కరచాలనం చేసుకుంటూ ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆపై ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలకు పైగా వారిద్దరి మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిపినట్టు సమాచారం.

20 నిముషాల పాటు ఇద్దరూ చర్చ .. ఏం మాట్లాడామో చెప్పనన్న జగ్గారెడ్డి
సమావేశం అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము సమావేశంలో ఏం మాట్లాడుకున్నామనే విషయాన్ని బహిర్గతం చేయబోమని వెల్లడించారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి నవ్వుతూ మీడియా ముందు ఐక్యంగా కనిపించటం, 20 నిమిషాల పాటు చర్చ జరపడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరిమధ్య విభేదాలు లేవని, కలిసిపోయారని భావిస్తున్నారు. వారు కలిసికట్టుగా పని చెయ్యాలని ఆకాంక్షిస్తున్నారు.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి
ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి బాహాటంగానే విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఆపై రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నానని పేర్కొన్న ఆయన రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన పైన కూడా విమర్శలు గుప్పించారు. మరోవైపు జగ్గారెడ్డి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు.

సీఎల్పీ సమావేశంలోనూ భట్టితో తనకు జరుగుతున్న అవమానాలపై జగ్గారెడ్డి
కొద్ది రోజుల క్రితం సిఎల్పీ సమావేశం సందర్భంగా కూడా జగ్గారెడ్డి భట్టి విక్రమార్కతో పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాల గురించి ఏకరువు పెట్టారు. పార్టీ అధిష్టానంతో తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని సోనియా గాంధీ తో, రాహుల్ గాంధీ తో మాట్లాడిన తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి తెలిపారు. ఈ అసహనం కొనసాగుతున్న సమయంలోనే తాజాగా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తో మాట్లాడటం ఆసక్తికర చర్చకు కారణమైంది. ఆ 20 నిముషాలు వారి మధ్య చర్చలో ఏం జరిగిందబ్బా అంటూ చర్చిస్తున్నారు పార్టీలోని నాయకులు, రాజకీయ వర్గాలు.