మెట్టినిల్లు వేదికగా శ్రీరామనవమి సాక్షిగా కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన!
తెలంగాణ రాష్ట్రంలో కవిత రాజకీయాలు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేదని భావించిన కవిత ఆ బాధ్యతను తాను తీసుకుంటున్నానని, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. కొత్త రాజకీయ పార్టీని పెట్టి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని కూడా ఇప్పటికే వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాలో కవిత కీలక ప్రకటన
అయితే శ్రీరామనవమి సాక్షిగా కవిత కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా కవిత మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు. కొత్త రాజకీయ పార్టీ దశ, దిశ నిర్ణయించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేపు కవిత చేయనున్న ప్రకటనపైన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్భంగా కవిత రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత
శ్రీ రఘునాథ ఆలయం ఖిల్లా రాంమందిర్ లో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో కవిత కుటుంబ సమేతంగా పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు.
కవిత కొత్త పార్టీపై ఆసక్తి
ఆ తర్వాత మధ్యాహ్నం నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈ ప్రెస్ మీట్ లో కవిత కీలక ప్రకటన చేయనున్నారు. కవిత పార్టీ ప్రకటన చేయనున్న క్రమంలో పార్టీ పేరు ఏంటి? పార్టీ లక్ష్యం ఏంటి? ముఖ్యంగా కవిత పార్టీతో ఏ రాజకీయ పార్టీకి నష్టం ఇలా అనేక ప్రశ్నలు ప్రజలకు వస్తున్నాయి.
నిజామాబాద్ ఆలయాలలో కవిత దంపతులు పట్టు వస్త్రాల సమర్పణ ఆనవాయితీ
ప్రతి సంవత్సరం కవిత దంపతులు శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రామాలయాల్లో పట్టువస్త్రాలు సమర్ఫించటం ఆనవాయితీ. ఈ ఏడాది రఘనాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్ పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత దంపతుల తరఫున వారి ప్రతినిధులు పట్టువస్త్రాలు సమర్పించున్నారు.
జాగృతి శ్రేణుల్లో ఉత్సాహం.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
శ్రీరామ నవమి వేడుకల్లో కవితతో పాటు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. శ్రీరామనవమి పండుగ రోజు కవిత సంచలన ప్రకటన చెయ్యనుండడంతో, కొత్త పార్టీని ప్రకటించనున్న క్రమంలో జాగృతి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, రాజకీయ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications