ఫోటోగ్రఫీతో ఒకరు, కారు డ్రైవింగ్ తో ఒకరు; స్వయంఉపాధితో స్ఫూర్తినిస్తున్న ట్రాన్స్ జెండర్లు!!
కరీంనగర్ ట్రాన్స్‌జెండర్స్ ఆషాడం ఆశ, నక్క సింధు స్వయం ఉపాధితో స్ఫూర్తి నింపారు.
ట్రాన్స్ జెండర్.. హిజ్రా.. ఈ పేరు వింటేనే సమాజంలో చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. వారిని చూస్తేనే వింతగా ఫీలవుతారు. వారి పట్ల చిన్నచూపు, ఏహ్య భావాన్ని ప్రదర్శిస్తారు. సమాజంలో వారి పట్ల జనాలలో ఉండే వివక్ష వారిలో ఉన్న టాలెంట్ ను చంపేసి బిక్షాటన వైపు నడిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో రైళ్లలో, బస్టాండులు వద్ద భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని, ఆత్మగౌరవంతో, చదువుకున్న చదువుతో, తాము చేయగలిగిన పనులతో ధైర్యంగా ముందుకు నడవచ్చని చాలామంది ట్రాన్స్ జెండర్లు భావిస్తున్నారు. ఇది వారిలో వస్తున్న కొత్త మార్పు.

రాష్ట్రంలోనే మొదటిసారి ట్రాన్స్ జెండర్ కు స్వయం ఉపాధి యూనిట్ , మరొకరికి డ్రైవింగ్ లైసెన్స్
ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలోనే ప్రధమంగా కరీంనగర్ జిల్లాలో స్వయం ఉపాధి యూనిట్ స్థాపన చేసుకోవడానికి ఒక ట్రాన్స్ జెండర్ కు సబ్సిడీ మీద రుణాలు అందించారు. అంతేకాదు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ను మరొక ట్రాన్స్ జెండర్ కు ఇచ్చి తద్వారా వారిని ప్రోత్సహించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ . అవకాశం ఇస్తే ట్రాన్స్ జెండర్లు కూడా అందరిలానే గౌరవంగా జీవించటానికి ముందుకు వస్తారు.

సహకరిస్తే సత్తా చూపేందుకు ట్రాన్స్ జెండర్ లు రెడీ
సమాజంలో ఒకప్పుడు ఉన్న వివక్ష కొద్దికొద్దిగా తొలగిపోవాలంటే, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కూడా వీరికి కావలసిన సహకారాన్ని అందించాలి. ఇక ఆ విధంగా సహకారాన్ని పొందితే వారి సైతం తమ సత్తాను చూపించడానికి కరీంనగర్ లోని ట్రాన్స్ జెండర్ ల మాదిరిగా ముందుకు వస్తారు. పీఎంఈజిపి పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం రాష్ట్రంలోనే ప్రధమంగా కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్ ఆషాడం ఆశ కు ఇటీవల సబ్సిడీ రుణం మంజూరి చేశారు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

ఆషాడం ఆశకు ఫోటోగ్రఫీ యూనిట్ కు సబ్సిడీ లోన్..
ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన డిసిసి డి ఎల్ ఆర్ సి సమావేశంలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్పథకం కింద స్వయం ఉపాధి కోసం ట్రాన్స్ జెండర్ కు రుణ మంజూరి పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రధమంగా కరీంనగర్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్ ఆషాడం ఆశకు ఫోటోగ్రఫీ యూనిట్ స్థాపన కోసం 5 లక్షల రూపాయలనుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ శాఖ ద్వారా మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఉపాధి కోసం నక్క సింధుకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్
ఇక ఇదే సమయంలో ఇంకొక ట్రాన్స్ జెండర్ నక్క సింధుకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ నుకలెక్టర్ పంపిణీ చేశారు. తన కాళ్ళ మీద తను నిలబడడానికి, జీవనోపాధి పొందడానికి నక్క సింధు సైతం ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉపాధి బాట పట్టింది. వీరిద్దరూ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కూడా కాస్త సహకారం అందించండి.. కచ్చితంగా మేము మా సత్తా చూపిస్తాం అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో స్ఫూర్తిని నింపి వారు మరో అడుగు ముందుకు వేయడానికి దారి చూపించారు ఆషాడం ఆశ, నక్క సింధు. వీరి బాటలో మరింతమంది ట్రాన్స్ జెండర్లు ఉపాధి అవకాశాలను కల్పించుకొని గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications