రేవంత్ రెడ్డికి టీడీపీలోకి తిరిగి రావాలి - పార్టీ అధ్యక్షుడి ఆహ్వానం..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిరిగి పార్టీలోకి రావాలని టీడీపీ నుంచి ఆహ్వానం అందింది.
తెలంగాణలో ఎన్నికల రాజకీయ వేడెక్కుతోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో పొత్తులు..కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. బీజీపి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ టార్గెట్ గా దూకుడుగా వెళ్తోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ సొంత పార్టీ సమస్యల మధ్యే యాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ టీడీపీ కూడా తమ సత్తా తగ్గలేదని చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గతంలో టీడీపీలో పని చేసి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిని తిరిగి టీడీపీలోకి రావాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందింది.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీడీపీకి బలం తగ్గలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించనున్నట్లు కాసాని స్పష్టం చేసారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ ను కాసాని టీడీపీలోకి తిరిగి రావాలని ఆహ్వానించారు.

ఈ మధ్య కాలంలో రేవంత్ తెలుగుదేశం పార్టీ తనకు అమ్మ లాంటిది అని.. ఆ పార్టీపై తన ప్రేమ ఎప్పటికీ పోదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను కాసాని ప్రస్తావించారు. తల్లి లాంటి టీడీపీ పార్టీలోకి రేవంత్ తిరిగి రావాలని కాసాని ఆహ్వానించారు. రేవంత్ పార్టీలోకి తిరిగి వస్తే ఆయనకు సాదర స్వాగతం పలుకుతామని కాసాని స్పష్టం చేశారు.
పొత్తులకు సంబంధించి కాసాని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీడీపీకి ఎవరితో పొత్తు ఉంటుందనేది ఎన్నికల సమయంలో మాత్రమే క్లారిటీ వస్తుందని కాసాని చెప్పుకొచ్చారు. పొత్తులపై ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమని..చోటు చేసుకొనే పరిణామాలు..సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని కాసాని వెల్లడించారు.
తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తుందనే వ్యాఖ్యల పైన కాసాని ఈ కామెంట్స్ చేసారు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. 2014 తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొత్తుల ద్వారా ఎన్నికల బరిలోకి దిగాలనేది టీడీపీ - జనసేన అధినేతల ఆలోచన. ఇప్పుడు కాసాని పొత్తుల పైన చేసిన వ్యాఖ్యలు..రేవంత్ కు ఆహ్వానం ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications