70మందితో తొలి జాబితా రెడీ? కేసీఆర్ దూకుడుపై పార్టీ శ్రేణుల్లో చర్చ!!
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మంచి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించాలని, మూడోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కెసిఆర్ అందుకు తగ్గట్టుగా ముందస్తు వ్యూహాలతో ఎన్నికలకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వే చేయించిన కేసీఆర్, వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అయిపోగానే మొదటి జాబితాగా 70 మందికి టికెట్లు ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని పార్టీ శ్రేణులలో జోరుగా చర్చ జరుగుతుంది.

ఆరు నెలలకు ముందే టికెట్లు ప్రకటిస్తానని కేసీఆర్ గతంలో చెప్పిన నేపథ్యంలో ఆ మాట ప్రకారం కెసిఆర్ మొదటి జాబితాలో 70 మందికి టిక్కెట్లను ప్రకటించబోతున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొంది. ఏయే నియోజకవర్గాలకు కేసీఆర్ టికెట్స్ ప్రకటిస్తారు? తమకు టికెట్ వస్తుందా లేదా? అన్న ఆందోళనలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత టికెట్లు ఇస్తే ఆశావహులు కొందరు నిరాశకు గురై ప్రత్యర్థి వర్గాలకు సహకరించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో, ఆరు నెలల ముందుగానే టిక్కెట్లను ప్రకటిస్తే, అసంతృప్తులను బుజ్జగించడానికి, వారిని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి సమయం సరిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేస్తే , పార్టీని వీడి వెళితే ఎన్నికల సమయంలో పెద్దగా ఎఫెక్ట్ ఉండబోదని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాలలో ప్రజా మద్దతు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని భావిస్తున్న కేసీఆర్, అటువంటి నాయకులు పార్టీ వీడి వెళ్లినా ఇబ్బంది లేదనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ విజయాన్ని అందించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్కెట్ల ప్రకటన ఆరునెలల ముందే చేయనున్నట్టు, అందుకు కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని పార్టీశ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications