వరంగల్ లో కేసీఆర్ సభ... అదునుచూసి రంగంలోకి గులాబీ బాస్..!
27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామని మాజీమంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిన్న రాత్రి హరిత కాకతీయలో మీడియాతో మాట్లాడిన ఆయన వరంగల్ కు బిఆర్ఎస్ కు విడదీయరాని బంధం ఉందని, బిఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించడానికి వరంగల్లో రెండు స్థలాలను చూసామని, త్వరలోనే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కే చంద్రశేఖర్ రావు ప్రారంభించిన పథకాలు దేశానికి దిక్సూచిగా ఉన్నాయని కేంద్రప్రభుత్వం కూడా మార్గదర్శకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రాజీనామా చెయ్యాలి
రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అపసోపాలు పడుతోందని ప్రస్తుతం సమర్థుడు ఎవరో అసమర్థుడు ఎవరో ప్రజలకు అర్థమైందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక అని పేర్కొన్న ఆయన, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డిపై ప్రజల అభిప్రాయం అర్థమైంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ పనైపోయింది
ఇచ్చిన హామీలను అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది అయితే హామీ ఇవ్వకపోయినా ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత కెసిఆర్ సర్కార్ ది అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ని తుక్కుతుక్కు ఓడించారని, భవిష్యత్తు ఎన్నికలలోను కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఓటమి రేవంత్ రెడ్డి పనితీరుకు రెఫరెండం అన్నారు.
వారిది కురచ బుద్ధి
డీకే అరుణ, ఈటెల రాజేందర్ ను మీరే గెలిపించారా? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మోడీ మంచోడని, కిషన్ రెడ్డి చెడ్డవాడని రేవంత్ రెడ్డి అంటున్నారని రాహుల్ గాంధీ కూడా చెడ్డవాడేనా చెప్పాలని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. తాను పొడుగరిగా పుట్టడం తన తప్పు కాదని, దాని గురించి కూడా భట్టి విక్రమార్క సీఎం మాట్లాడితే అది వారి కురచ బుద్ధికి నిదర్శనం అన్నారు.
గోదావరి జలాలను ఏపీకి తరలిస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంది
స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే విజయం అని హరీష్ రావు అన్నారు. గోదావరి వరద జలాలను ఏపీకి తరలిస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుందని గుర్తు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబు నాయుడుకు భయపడుతున్నాడు అని, బిజెపికి చంద్రబాబుని ప్రశ్నించే ధైర్యం లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
లక్షలాది మందితో రజతోత్సవ సభ
వరంగల్ వేదికగా నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. లక్షలాది మందితో రజతోత్సవ సభను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 14ఏళ్ల ఉద్యమం, 9ఏళ్ల పాలన మేళవింపే రజతోత్సవ సభ అని పేర్కొన్న హరీష్ రావు లక్షలాది మందితో దీనిని సక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. ఇక వరంగల్లో సభ నిర్వహించాలన్న ప్లాన్ లో బిఆర్ఎస్ ఉండడంతో గులాబీ బాస్ త్వరలో రంగంలోకి దిగబోతున్నాడని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications