సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు - అసలు అజెండా అదే : పోటీ ఉంటుందా..!!
జాతీయ రాజకీయాల పైన వ్యూహాత్మక అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ముఖ్యమైన సమావేశానికి సిద్దమయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో హైదరాబాద్ వచ్చిన హేమంత్ సోరెన్ సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో సోరెన్ సైతం కేంద్ర ప్రభుత్వ తీరు..బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ సాదర స్వాగతం పలికారు.

ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు
అదే విధంగా ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామితోనూ కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు. రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త ప్రకటన ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. దీంతో..ఆ ప్రకటన సమయం నుంచి ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఎం కేసీఆర్ లక్ష్యంగా పదునైన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇక, తాజాగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రసంగంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్రం పైన విమర్శలు ఎక్కుపెట్టారు.

కేంద్రం పైన పోరాటం.. కీలక ప్రకటన దిశగా
దేశానికే తెలంగాణ దిక్సూచీగా నిలిచిందని చెబుతూనే..కేంద్ర తమ పైన వివక్ష చూపుతుందని చెప్పారు. ఇక, గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చెబుతూ పోతే..వచ్చే ఎన్నికల ఫలితాలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న వేళ..కేసీఆర్ పాత్ర పైన ఇప్పుడు ఆసక్తి కర చర్చ సాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉమ్మడి అభ్యర్ధిని పోటీకి నిలుపుతారా లేదా అనే అంశం పైన ఈ చర్చ సాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏంటి వ్యూహం
అదే సమయంలో..ప్రధాని మోదీ - హోం మంత్రి అమిత్ షా తమకు మద్దతిచ్చే పార్టీల నేతలతో రాష్ట్రపతి ఎన్నిక పైన చర్చలు చేస్తున్నారు. వైసీపీ సైతం మద్దతు ప్రకటిస్తే ఎన్డీఏ ప్రతిపాదించే అభ్యర్ధి రాష్ట్రపతిగా గెలవటం ఖాయమని తెలుస్తోంది. దీంతో.. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులు మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications