ముహూర్తం ఖరారు: ఈ ముహూర్తానికే కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం
తెలంగాణలో పూర్తి స్థాయి మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. భారీ మెజార్టీతో గెలిచిన గులాబీ పార్టీ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రేపు చేస్తారా లేక ఎల్లుండి చేస్తారా అనేదానిపై చర్చజరుగుతోంది. వేదపండితుల సలహా సీఎం కేసీఆర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1:10 గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేసీఆర్ సంఖ్యాశాస్త్రాన్ని బాగా నమ్ముతారని సమాచారం. ఆయనకు కలిసొచ్చే సంఖ్య 6 కాబట్టి ఆ ప్రకారమే తనకు సంబంధించిన పనులన్నీ జరగాలనేది ఆయన కోరిక.మరోవైపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు మంచి ముహూర్తం కోసం కూడా చూశారు. రేపు సుబ్రహ్మణ్య షష్టి కాబట్టి ఉదయం 11 గంటల లోపు మూడు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెప్పారు. ఎల్లుండి సప్తమి కావడం అది కూడా మంచి రోజు అవడంతో ప్రమాణ స్వీకారం ఆరోజు కూడా పెట్టుకోవచ్చని పండితులు సూచించారు. రేపు మధ్యాహ్నం 1:10 గంటలకు కూడా మంచి ముహూర్తం ఉండటంతో ఆ సమయాన్నే కేసీఆర్ ఎంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రాజ్‌భవన్ వేదిక కానుంది.














Click it and Unblock the Notifications