
ప్రాంతేతర పార్టీలు తెలంగాణాలో పనిచెయ్యటమే కేసీఆర్ కు కావాలి; ఎందుకంటే!!
బిజెపి నాయకురాలు విజయశాంతి రాష్ట్రంలో తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల దాడి అంటూ సీఎం కేసీఆర్ కొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఇక ఇది తన మాట కాదని, దశాబ్ద కాలపు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన తన తోటి ఉద్యమకారులు చెబుతున్న మాట అని విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రాంతేతర పార్టీలు తెలంగాణాలో పని చెయ్యటం కేసీఆర్ కు అవసరం
ఇక విజయశాంతి చెప్పింది ఏంటంటే కెసిఆర్ పెట్టిన టిఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండే పార్టీ కాదు. ముందుకు వెళ్లే పార్టీ అంతకంటే కాదు. ఇది ఆయనకు కూడా అందరికన్నా మంచిగా తెలుసు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇకనుంచి బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడుతుంది కాబట్టి పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుందనే భ్రమ తో ప్రాంతేతర పార్టీలు కొన్ని ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా భావించి తెలంగాణ రాష్ట్రంలో పని చేయడమే కెసిఆర్ కు ఎంతో అవసరం.

తెలంగాణ పైన మళ్ళా మీ ప్రాంతీయ పార్టీల దాడి ఏంటి? ఇది కేసీఆర్ ప్లాన్
ఇలా వాళ్లు పని చేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకును మళ్లీ తమవైపు తిప్పుకోవడం కోసం సీఎం కేసీఆర్ మళ్లీ జనాలలో ప్రాంతేతరుల దాడి అన్న అంశాన్ని తెరమీదకు తీసుకు రావడానికి ప్రయత్నం చేసి ప్రజలను తమవైపు తిప్పుకునే ఎత్తుగడ వేస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు. మరోమారు తెలంగాణ వాద ప్రజా ఓటు బ్యాంకును ఈ కొత్త పరిణామాలు మా దశాబ్దాల పోరాట తెలంగాణ పైన మళ్ళా మీ ప్రాంతీయ పార్టీల దాడి ఏంటి? ఆక్రమణ ప్రయత్నం ఏంటి? అనే ఆక్రోశంతో జనాలను టిఆర్ఎస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున మళ్ళించడం కోసం సీఎం కేసీఆర్ వ్యూహంగా అర్థం చేసుకుంటే అది వాస్తవ దూరం ఎంత మాత్రం కాదు అని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ప్రాంతేతర పార్టీల దాడి పేరుతో మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ : విజయశాంతి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రోజువారి సంఘటనలు అందుకు దారితీసేటట్లుగానే ఉన్నట్టు విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలతో తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది తనతో ఈ అభిప్రాయాన్ని చెప్పారని విజయశాంతి పేర్కొన్నారు.
అంటే ప్రస్తుతం వైయస్ షర్మిల వ్యవహారంలో జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతేతర పార్టీల దాడిగా కేసీఆర్ చూపించే ప్రయత్నంగా విజయశాంతి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సమైక్యవాదుల కుట్రలు, ప్రాంతేతర పార్టీల దాడులు అంటూ కొత్త రాగం అందుకున్న టిఆర్ఎస్ ప్రజలలో తెలంగాణ వాదాన్ని మరొకసారి రేకెత్తించి ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంగా దీనిని విజయశాంతి పేర్కొన్నారు.