మేడారం వెళ్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, గిరిజన కుంభమేళా అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 10 రోజుల సమయమే ఉంది. ఈ క్రమంలో మేడారంలో పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మంత్రి సీతక్క స్వయంగా అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రేపు మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.
మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ ఆంక్షలు
నేడు సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకొని అక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం వచ్చు భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అసలే ఆదివారం, సీఎం పర్యటన నేపధ్యంలో మేడారం జాతరకు వెళ్ళే భక్తులు తప్పనిసరిగా ట్రాఫిక్ ఆంక్షలు తెలుసుకోవాలని అంటున్నారు.

మేడారం వెళ్ళే వారికి ఆ మార్గంలో అనుమతి లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో, ఆదివారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయబడుతున్నాయి అని ములుగు ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ తెలిపారు. వరంగల్ నుండి వచ్చే వారు ములుగు పస్రా నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలి, తాడ్వాయి మీదుగా ప్రవేశం లేదని ములుగు ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ పేర్కొన్నారు.
తిరుగు ప్రయాణం ఇలా, వాటిపై ఆంక్షలు
తిరుగు ప్రయాణం బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా వరంగల్ చేరుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకే ప్రవేశ మార్గం అనగా పస్రా నుండి ప్రాజెక్ట్ నగర్, నర్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలని సూచించారు.
భక్తులు పోలీసులకు సహకరించవలసిందిగా ములుగు ఎస్పీ విజ్ఞప్తి
భక్తుల సౌకర్యార్థం అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయబడ్డాయని వివరించారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలు అనుసరించి ప్రశాంతమైన దర్శనం చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. భక్తులు పోలీసులకు సహకరించవలసిందిగా ములుగు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వీలైతే నేడు, రేపు మేడారం జాతరకు వచ్చే భక్తులు తమ టూర్ వాయిదా వేసుకోగలిగితే మంచిది. సీఎం పర్యటన నేపధ్యంలో పటిష్ట బందోబస్తు ఉంటుంది. కాబట్టి ఫ్రీగా తిరిగే, ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉండదు. కనుక సీఎం పర్యటన ముగిశాక ప్లాన్ చేసుకోండి.












Click it and Unblock the Notifications