ప్రపంచంలోనే అరుదైన వ్యాధితో మహిళ.. ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన వైద్య విజయం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 19 మందిలో మాత్రమే నమోదైన అత్యంత అరుదైన వెబర్ క్రిస్టియన్ డిసీజ్ తో బాధపడుతూ, కాలేయం పూర్తి వైఫల్యం చెందిన 26 ఏళ్ల యువతిని కాపాడారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం లేకుండానే ఆమెను పూర్తిగా కోలుకునేలా చేసి వైద్య చరిత్రలో మరో హిస్టరీ నమోదు చేశారు.
వెబర్ క్రిస్టియన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న మహిళకు చికిత్స
2018లోనే ఈ యువతికి కాళ్లు, చేతులపై నొప్పితో కూడిన గడ్డలు మరియు ఎప్పటికీ జ్వరం వస్తూ ఉండేది. కిమ్స్ రుమటాలజీ బృందం పరీక్షలు నిర్వహించి వెబర్ క్రిస్టియన్ సిండ్రోమ్‌గా గుర్తించి సకాలంలో చికిత్స అందించింది. ఆ సమయంలో సరైన చికిత్సతో వ్యాధి అదుపులోకి వచ్చి ఆమె ఆరేళ్ల పాటు సాధారణ జీవితం గడిపింది.

అత్యంత విషమ స్థితిలో ఆసుపత్రిలో చేరిన మహిళ
అయితే 2026 ఏప్రిల్ 17న ఆమె తీవ్రమైన జ్వరం, కామెర్లు మరియు మెదడులో రక్తస్రావంతో అత్యంత విషమ స్థితిలో ఆసుపత్రిలో చేరింది. పరీక్షల్లో కాలేయం పూర్తిగా పనిచేయడం మానేసినట్లు తేలింది. గ్రేడ్-4 హెపాటిక్ ఎన్సెఫలోపతి స్థాయికి చేరుకోవడంతో ఆమెను వెంటనే ICUలో వెంటిలేటర్‌పై ఉంచారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు సిద్ధమవ్వాలని వైద్యులు భావించిన సమయంలోనే కీలకమైన మలుపు వచ్చింది.
మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ గా గుర్తించిన వైద్యులు
రక్తంలో ఫెరిటిన్ స్థాయులు అసాధారణంగా పెరగడాన్ని గమనించిన వైద్యులు, ఆమెకు మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MAS) ఏర్పడినట్లు నిర్ధారించారు. వెబర్ క్రిస్టియన్ వ్యాధి నేరుగా కాలేయాన్ని తాకి ఫల్మినెంట్ హెపటిక్ ఫెయిల్యూర్‌కు దారితీయడం ప్రపంచంలోనే మూడవ కేసు మాత్రమేనని డాక్టర్లు వెల్లడించారు.
అత్యాధునిక వైద్య విధానంతో మందులు ఇచ్చిన కిమ్స్ వైద్యులు
కిమ్స్ రుమటాలజీ, హెపటాలజీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు క్రిటికల్ కేర్ బృందాలు ఆమెకు వైద్యం చేయటం కోసం సమన్వయంతో పనిచేశాయి. శక్తివంతమైన యాంటీబయోటిక్స్, పల్స్ స్టెరాయిడ్స్‌తో పాటు విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అనాకిన్రా (Anakinra) అనే IL-1 రిసెప్టర్ యాంటాగనిస్ట్ మందు ఇచ్చారు. ఈ ఔషధం అందించిన తర్వాత ఆమెలో వాపు తగ్గడం ప్రారంభమై, కాలేయం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.
ఆరోగ్యంగా మహిళ ఇంటికి
కొద్ది రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకుని వెంటిలేటర్ నుంచి బయటపడి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లింది. డాక్టర్ శరత్ చంద్రమౌళి రుమటాలజీ & క్లినికల్ ఇమ్యూనాలజీ డైరెక్టర్ మరియు డాక్టర్ కె.ఎన్. చందన్ కుమార్ హెపటాలజీ నేతృత్వంలోని బృందం ఈ సంక్లిష్ట కేసును నిర్వహించింది. ఈ విజయం ద్వారా అరుదైన వ్యాధుల చికిత్సలో కిమ్స్ భారతీయ వైద్య రంగం సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచం ముందు నిలిపింది.












Click it and Unblock the Notifications