తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఇమిడియట్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియామకానికి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిననాటి నుంచి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమై అందరినీ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేసింది. పాత, కొత్త నేతలంతా కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని రాహుల్ గాధీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీలో నేతల మధ్య విభేధాలుంటే అంతర్గతంగానే చర్చించుకోవాలని మీడియా ఎదుట, బహిరంగ వ్యాఖ్యలు సరికాదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా, ఈ క్రమంలో సోనియా, రాహల్ గాంధీల ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
మరోవైపు, తుంగతుర్తి నియోజకవర్గంలో డాక్టర్ రవి కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ రావు లేఖ రాశారు. ఈ లేఖలో మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలపై సోనియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కోమటిరెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమిస్తూ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications