ఎర్రబెల్లికి తిప్పలు మొదలు.. అప్పుడే మొదలెట్టిన కొండా సురేఖ!!
తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ కొండా సురేఖ గురించి తెలియని వారు ఉండరు. అలాగే కొండా సురేఖకు చిరకాల ప్రత్యర్థి, ఆజన్మ శత్రువు ఎవరు అని ఎవరినైనా అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు అని తేల్చి చెబుతారు. ఈసారి ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుని చావు దెబ్బ కొట్టారు కొండ సురేఖ.
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఎన్నికల బరిలోకి దిగి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను ఓడించిన కొండ సురేఖ, పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగిన యశస్విని రెడ్డికి తన వంతు మద్దతునందించి ఎర్రబెల్లి దయాకర్ రావు గద్దె దిగేలా చేశారు. 30ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుని, కేవలం 26ఏళ్ళ యశస్విని రెడ్డి చేతిలో దారుణ ఓటమి పాలయ్యేలా చేశారు.

యశస్విని రెడ్డికి కొండా సురేఖ, కొండ మురళి దంపతులు మద్దతు పలికారని, ఇంటర్నల్ గా ఆమెకు సహకారాన్ని అందించారని జిల్లాలో జోరుగా చర్చ జరిగింది. ఇక ఫైనల్ గా ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించడంతో పాటు ఎమ్మెల్యేగా గెలిచి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన కొండ సురేఖ తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
గత రెండు రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే ఉంటున్న క్రమంలో యశస్విని రెడ్డి, కొండా సురేఖ ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఒక వీడియోను చేశారు. హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, యశస్విని రెడ్డి బై బై దయాకర్ రావు అంటూ ఒక వీడియోను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు పై యశస్విని రెడ్డి గెలిచి సంచలనం సృష్టించగా, ఆమె గెలుపుకు సహకరించడం మాత్రమే కాదు, ఎర్రబెల్లి తమ్ముడు ప్రదీప్ రావు ని ఓడించి కొండా సురేఖ పంతం నెగ్గించుకున్నారు. ఇక ఈ వీడియో ద్వారా ఎర్రబెల్లి ఓటమిని ట్రోల్ చేసిన కొండా సురేఖ ముందు ముందు ఎర్రబెల్లికి చుక్కలు చూపించనున్నారని, ఆయనకు తిప్పలు మొదలయ్యాయని అర్థమయ్యేలా చెప్పారు.












Click it and Unblock the Notifications